ప్రజలను మోసగిస్తున్న రాష్ట్ర సర్కారు: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్
‘పట్నం’లో బీజేపీ అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ ను గెలిపించాలి
రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పడటం ఖాయం
ఇబ్రహీంపట్నం, వాయిస్ టుడే:
ప్రజల సమస్యలను పరిష్కరించడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ కు మద్దతుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని తారమతిపేట, బలిజగూడ, చిన్నరావిరాల, పెద్దరావిరాల, అబ్దుల్లాపూర్ మెట్టు తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి ముఖ్యఅతిథిగా తూళ్ల వీరేందర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తూళ్ల వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నివసిస్తున్న పేదలకు డబుల్ బెడ్ రూములను కేటాయించకుండా, హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వారికి ఇక్కడి ప్రాంతంలో కేటాయించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుందని విమర్శించారు. ఇబ్రహీంపట్నం బిజెపి అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ ను గెలిపిస్తే ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తారని భరోసా కల్పించారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇక్కడి భూములను కాజేసి తన ఆస్తులను కూడబెట్టుకుంటున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం బిజెపి అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ కమలం పువ్వు గుర్తుపై ఓట్లను వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తూళ్ల వీరేందర్ గౌడ్ ఓటర్లను కోరారు. నోముల దయానంద్ గౌడ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలు ఆయనకు మంగళ హారతులు పట్టారు. అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీసుకువచ్చిన గజమాలతో నోముల దయానంద్ గౌడ్ ను సన్మానించారు. అంతకుముందు తారామతి పేట్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి నోముల దయానంద్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వడ్డేపల్లి పాపయ్య గౌడ్, షకీల్ మీర్జా, బూర మల్సూర్ గౌడ్, సీక బాలరాజు గౌడ్, నోముల కార్తీక్ గౌడ్, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.



