ఆర్మీ ఆయుధాల చోరీ..
రిటైర్డ్ హవల్దార్ అరెస్ట్
Theft of Army weapons…
Retired Havildar arrested.
హైదరాబాద్: బొల్లారంలోని 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి తుపాకులు, పిస్టల్స్, మందుగుండు సామగ్రి చోరీ చేసిన కేసులో రిటైర్డ్ ఆర్మీ హవల్దార్ ఉప్పుతొల్ల మల్లేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బొల్లారం పోలీసులు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ మల్కాజిగిరి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. మద్రాస్ రెజిమెంట్‌లో సుమారు 16 ఏళ్ల పాటు విధులు నిర్వహించిన మల్లేష్ ఈ ఏడాది జూన్‌లో ముందస్తు పదవీ విరమణ పొందాడు. ముందస్తు పదవీ విరమణపై అసంతృప్తితోనే ఆయుధాల చోరీకి పాల్పడినట్లు సమాచారం. అయితే చోరీ వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఆగస్టు 30–31 రాత్రి సమయంలో మల్లేష్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి ఒక ఏకే రైఫిల్, ఒక ఇన్సాస్ రైఫిల్, మూడు పిస్టల్స్, నైట్ విజన్ గాగుల్స్, బుల్లెట్లను చోరీ చేసి పరారైనట్లు పోలీసులు గుర్తించారు.
చోరీ చేసిన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కౌకూరు, యాప్రాల్, నాగర్‌కర్నూలులోని వేర్వేరు ప్రాంతాల్లో దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి స్వస్థలం నాగర్‌కర్నూలు కావడంతో అక్కడ కూడా పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు.
బొల్లారం పోలీసులు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ మల్కాజిగిరి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో మల్లేష్‌ను అరెస్ట్ చేసి, చోరీకి గురైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.




