రేవంత్ అసమర్థ పాలనకు నిదర్శనం ఈ బడ్జెట్
-తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిన బడ్జెట్
-మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
This budget is proof of Revanth's incompetent governance: Former MLA Putta Madhukar
మంథని
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రెండో బడ్జెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్ధ పాలనకు నిదర్శనమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు.
ఎన్నికల ముందు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గారంటీలను తుంగలో తొక్కి కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపడానికి ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి బడ్జెట్ లో కేటాయింపులు చేయడం సిగ్గు చేటన్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చిన ఆరు గారంటీలను 500 రోజులైనా అమలు చేయకపోగా అందులో పేర్కొన్న అంశాలను తప్పుదారి పట్టించే ప్రక్రియకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. బడ్జెట్ లో రూ. 6 వేల కోట్లు కేటాయించి వాటిని విద్యార్థులకు బదులు కాంగ్రెస్ కార్యకర్తలకు పప్పు, బెల్లంలా పంచిపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. రూ. 2 లక్షల 90 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన గత సంవత్సరంలోనే రూ. 70 వేల కోట్ల లోటుందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ప్రకటించి ఇప్పుడు రూ. 3 లక్షల 5 వేల కోట్లకు ఎలా పెంచారని, గత సంవత్సరంతో పోల్చితే ఇప్పుడు ఆదాయం ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. కొత్తగా రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి కూడా తన ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని బేల మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఆరు గారంటీలను అమలు చేయడం మానుకుని రూ. 6 వేల కోట్లు కార్యకర్తలకు పంచడానికి బడ్జెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. తెలంగాణ అక్కాచెల్లళ్లకు ప్రతినెలా ఇస్తా అన్న రూ. 2500 కు బడ్జెట్ లో కేటాయింపులు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అబద్దాల పునాదుల మీద చేస్తున్న పరిపాలనకు ఫుల్ స్టాప్ పెట్టి వాస్తవంలోకి రావాలని కోరారు. అప్పు చేసి పప్పుకూడు రాష్ట్రనికి ముప్పని రేవంత్ రెడ్డి చెప్తే ఇక అతను అబద్దాలను మానేసి, అప్పులకు తావులేకుండా అసలు సిసలు బడ్జెట్ ప్రవేశ పెడతాడని ఆశించిన ప్రజలకు నిరాశయే ఎదురైందాన్నారు. అంకెల గారడీతో ఆరు గారంటీలకు ఎగనామం పెట్టి, రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను, ఆటో డ్రైవర్లను, గిగ్ వర్కర్లను, మహిళలను, ఉద్యోగులను సబ్బండ వర్గాలను నిండా ముంచిన బడ్జెట్ అని ఆయన విమర్శించారు.


