చంద్రబాబు, పవన్ పై రోజా సెటైర్లు
తిరుపతి, ఆగస్టు 28: చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై మంత్రి రోజా సెటైర్లు వేశారు. ఏపీలో జగన్
మోహన్ రెడ్డి సర్కారు అమలు చేస్తున్న విద్యా దీవెన, విద్యా కానుక పథకాలను ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కి కూడా అమలు చేయాలని ఎద్దేవా చేశారు. ఇంటర్ లో తాను ఏ గ్రూప్ చదివాడో కూడా పవన్ కల్యాణ్ కు తెలియదని.. బైపీసీ చదివితే ఇంజినీర్ అవ్వొచ్చని చంద్రబాబు అంటారని మంత్రి ఆర్కే రోజా చురకలంటించారు. తెలుగు దేశం పార్టీని నమ్ముకుంటే యువత జైలుకు వెళ్తారని, పవన్ ను నమ్ముకుంటే యువత రిలీజ్ సినిమాలకు వెళ్తారని మంత్రి రోజా విమర్శించారు. అదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మంచి కాలేజీలు, వర్సిటీలకు వెళ్తారని రోజా కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో పర్యటిస్తున్నారు. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ఏప్రిల్ – జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంట్ ను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. బటన్ నొక్కి రూ. 680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.ఈ కార్యక్రమం సందర్భంగా వేదికపై మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవిలో తొలిసారి నగరికి వచ్చిన సీఎం జగన్ కు రోజా కృతజ్ఞతలు తెలిపారు. నగరి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రావడం చాలా సంతోషంగా ఉందని రోజా అన్నారు. నాణ్యమైన విద్యను పేదవాడి ఆస్తిగా మార్చిన ఘనత జగన్ కే దక్కుతుంది అని మంత్రి రోజా కొనియాడారు. చదువుకు కులం, మతం, ప్రాంతం లాంటి బేధాలు లేకుండా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ వస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రశంసించారు. విద్యారంగంలో ఏపీ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఆర్కే రోజా కొనియాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వల్లే అన్ని వర్గాలకు విద్య చేరువ అయిందని, ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు పోటీ ఇస్తున్నాయని చెప్పుకొచ్చారు. విద్యా దీవెన, వసతి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదని చెప్పారు. ఇంత గొప్ప ఆలోచన ఎవరికీ కూడా రాలేదని అన్నారు. విప్లవాత్మకమైన మార్పులు చేస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత సీఎం జగన్ దే అని కొనియాడారు. ఏపీలో విద్యారంగాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే ప్రశంసించారని అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓడించే వాడు ఇంకా పుట్టలేదని ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా అన్నారు. జగన్ ను ఓడించాలంటే.. అవతలివైపు జగనే ఉండాలని కొనియాడారు. ఎమ్మెల్యేగా గెలవలేని వాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎలా ఓడిస్తాడని మంత్రి రోజా ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 సీట్లు ఇచ్చి దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని రోజా అన్నారు. 2024 జగనన్న వన్స్ మోర్ అంటున్నారని చెప్పుకొచ్చారు.
నగరిలో జగన్ చెప్పినా…
సీఎం జగన్ మోహన్ రెడ్డి నగరి పర్యటనలో భాగంగా వైసీపీలో విభేదాలు వెలుగులోకి వచ్చాయి. నగరిలో ఎప్పటి నుంచో మంత్రి రోజాకు ఇతర నేతలకు అసలు పడటం లేదు. నగరిలో పర్యటించిన సీఎం జగన్ వారి మధ్య విభేదాలు సరి చేసేందుకు ట్రై చేశారు. నగరిలో బహిరంగ సభ ప్రారంభానికి ముందు కేజే శాంతి, మంత్రి రోజా మధ్య సఖ్యత పెంచేందుకు జగన్ ట్రై చేశారు. వారితో ఏదో మాట్లాడుతూ ఇద్దరి చేతులు కలిపేందుకు కూడా ప్రయత్నించారు. మొదట కేజే శాంతి తన చేయి ఇచ్చేందుకు నిరాకరించారు. అయినా సీఎం జగన్ ఆమె చేయిని పట్టుకొని రోజాతో చేయి కలపాలని చూశారు. కానీ ఏదో అలా చేతులు కలిపి వెంటనే వెనక్కి తీసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎప్పటి నుంచో వర్గ విభేదాలు వెలుగు చూశాయి. గత కొన్ని నెలలుగా మంత్రి పెద్దిరెడ్డి, రోజా మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. సీఎం పర్యటన సందర్భంగా కూడా ఈ కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. సీఎం పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీల్లో ఎక్కడా రోజా ఫొటో లేదు.ఇవన్నీ గమనించిన సీఎం జగన్… వాటిని సరిదిద్దేందుకు యత్నించారు. కానీ అవేవీ వర్కౌట్ అయినట్టు కనిపించడం లేదు.