బీఆర్ఎస్‌లో సెగలు రేపుతున్న “టిఆర్ఎస్”
* షాద్‌నగర్‌లో కవిత పార్టీకి పెరుగుతున్న ఆదరణ
* బీఆర్ఎస్ నేతల చూపు కొత్త టిఆర్ఎస్ వైపు..?
“TRS” Sparks a Row within BRS
వాయిస్ టుడే :హైదరాబాద్
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ, కల్వకుంట్ల కవిత స్థాపించిన “టిఆర్ఎస్” (తెలంగాణ రాష్ట్ర సేన) పార్టీ, భారత రాష్ట్ర సమితి లో ప్రకంపనలు సృష్టిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా షాద్‌నగర్ నియోజకవర్గంలో ఈ కొత్త పార్టీపై ఆసక్తి పెరుగుతుండటం గమనార్హం.
స్థానికంగా కొందరు బీఆర్ఎస్ కీలక నేతలు, కార్యకర్తలు కవిత పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జోరందుకుంది. సాధారణ ప్రజల్లో కూడా ఈ కొత్త రాజకీయ వేదికపై ఆసక్తి కనిపిస్తోందని సమాచారం. దీంతో భవిష్యత్తులో షాద్‌నగర్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన కవిత, మహిళలను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన నాయకురాలిగా గుర్తింపు పొందారు. తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మ వంటి సాంస్కృతిక ఉద్యమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అనంతరం నిజామాబాద్ ఎంపీగా, ఎమ్మెల్సీగా సేవలందించారు.
అయితే, రాజకీయ పరిణామాలు ఆమెకు ప్రతికూలంగా మారి, న్యాయపరమైన వ్యవహారాల్లో చిక్కుకుని జైలు జీవితం గడపాల్సి వచ్చింది. తరువాత కోర్టు ద్వారా నిర్దోషిగా బయటకు వచ్చిన కవిత, సొంత పార్టీలోనూ ప్రాధాన్యం కోల్పోయిన నేపథ్యంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చివరకు కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభించారు.
తన కొత్త పార్టీకి “టిఆర్ఎస్” పేరును ఉపయోగించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా “తెలంగాణ రాష్ట్ర సమితి” బదులు “తెలంగాణ రాష్ట్ర సేన”గా నామకరణం చేయడం వ్యూహాత్మకంగా భావిస్తున్నారు.
ఇక షాద్‌నగర్‌లో బడా నాయకులు కొందరు ఈ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఇది నిజమైతే, బీఆర్ఎస్‌కు ఇది పెద్ద సవాలుగా మారే అవకాశముంది.
మొత్తంగా, కవిత ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందా? బీఆర్ఎస్‌పై ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అంశంగా మారింది.



