హైదరాబాద్, సెప్టెంబర్ 5: కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తాజాగా కుటుంబ ఆస్తులు, అప్పులను మంత్రి పీఎంవో కార్యాలయానికి సమర్పించారు. అందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన స్థిరాస్తులు, చరాస్తుల విలువ సంవత్సరంలో రూ.54,58,003 తగ్గింది. మార్చి 31, 2022 నాటికి అతని కుటుంబ ఆస్తులు రూ. 17,39,04,250.44 ఉండగా, ఆగస్టు 2023 నాటికి రూ.16,84,46,246.96కి తగ్గింది. అదే సమయంలో అప్పులు కూడా రూ. 90,68,948 తగ్గాయి. కిషన్ రెడ్డి కుటుంబం వద్ద గతేడాది రూ.2,45,000 నగదు ఉండగా, ఈ ఏడాది రూ.3,30,000కు చేరింది. అదే సమయంలో ఆస్తుల విలువ రూ.8,82,60,250.44 నుంచి రూ.8,42,49,246.96కి తగ్గింది. మొత్తం కుటుంబ ఆస్తుల నికర విలువ రూ.40.11 లక్షలు తగ్గింది. అదే సమయంలో కుటుంబ స్థిరాస్తి విలువ రూ.8,53,99,000 నుంచి రూ.8,38,67,000కి తగ్గింది.

హిందూ ఉమ్మడి కుటుంబం పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.40,31,000 తగ్గింది. కొడుకు పేరు మీద ఉన్న స్థిరాస్తి రూ.24.99 లక్షలు పెరిగింది. భార్య పేరు మీద అప్పులు రూ.12,35,448 తగ్గగా, కూతురు పేరిట రూ.78,33,500 తగ్గాయి. కిషన్ రెడ్డి పేరు మీద 1995 మోడల్ మారుతీ 800 కారు (రూ. 40 వేలు) ఉంది. ఇది కాకుండా వారి కుటుంబ సభ్యులకు ఎవరికీ కారు లేదు. హిందూ ఉమ్మడి కుటుంబంలో రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో 8.2850 ఎకరాల వ్యవసాయ భూమి కిషన్‌రెడ్డికి సంక్రమించింది. ఎకరాకు రూ.8.80 లక్షల చొప్పున రూ.76.67 లక్షలుగా పేర్కొన్నారు. అదే గ్రామంలో 300 చదరపు అడుగుల స్థలంలో ఇల్లు ఉన్నట్లు తేలింది. దీని మార్కెట్ విలువ రూ.6 లక్షలు ఉంటుందని తెలిపారు.కిషన్ రెడ్డి కుమారుడి పేరిట కాచిగూడలో వారసత్వంగా వచ్చిన 122 చదరపు గజాల స్థలంలో భవనం ఉంది. దీని మార్కెట్ విలువ రూ.1,20,19,000గా చూపబడింది. అతని భార్యకు బంజారాహిల్స్‌లో 425 చదరపు గజాల స్థలం ఉంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1,78,50,000. డిసెంబర్ 30, 2021న, ఆమె యూసుఫ్‌గూడలో రూ.4,57,31,000కి 600 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. దీని మార్కెట్ విలువ కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఆస్తుల్లో కిషన్ రెడ్డి పేరిట మూడు బ్యాంకుల్లో డిపాజిట్లు, క్యాడిలా హెల్త్ కేర్ లో 3 వేల షేర్లు, 2 ఎల్ ఐసీ పాలసీలు ఉన్నాయి. పీఎంవోకు సమర్పించిన వివరాల్లో వైష్ణవి అసోసియేట్స్‌కు రూ.2 లక్షలు, ఇందిరా లెజిస్లేచర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి రూ.5 లక్షలు రుణం ఇచ్చినట్లు వెల్లడించారు.


