17.6 C
New York
Wednesday, May 29, 2024

మద్యం ప్రియులకు దొరకని బీర్లు

- Advertisement -

వేసవి కాలంలో ప్రధాన బ్రాండ్ల కొరత

నాలుగు నెలల్లోనే 2,96,977 కేసులు అమ్మకం

రూ.206.71 కోట్ల విక్రయాలు

జిల్లాలో 49 వైన్‌ షాపులు, ఐదు బార్లు

మెదక్‌: టెండల్లో బుసబుస పొంగే చల్లని బీరు తాగి ఉపశమనం పొందాలనుకునే మందుబాబులకుకష్టకాలమొచ్చింది.

వైన్‌ షాపుల్లో బ్రాండెడ్‌ బీర్లు దొరకని పరిస్థితి నెలకొంది. మద్యం డిపోలు ప్రధాన బ్రాండ్ల బీర్లపై రేషన్‌ విధించడంతో అటు వైన్‌షాప్‌ యజమానులు.. ఇటు కొనుగోలు దార్లు నిరుత్సాహానికి గురవుతున్నారు. దీంతో మద్యం ప్రియులు దొరికిన దానితోనే సరి పెట్టుకుంటున్నారు. ఒక్కో షాపునకు ఇండెక్స్‌ ఆధారంగా 20 నుంచి 25 కేసులు ఇస్తుండగా.. ఇది ఒక రోజుకు కూడా సరిపోదని మద్యం వ్యాపారులు పెదవి విరుస్తున్నారు.

జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్‌లో ఎక్సైజ్‌ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 49 వైన్‌ షాపులు, ఐదు బార్లు ఉన్నాయి. ఈయేడు ఎక్సైజ్‌ సంవత్సరం డిసెంబర్‌లో ప్రారంభమైంది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కొంత మేర మద్యం అమ్మకాలు పెరిగాయి. గతేడాది డిసెంబర్‌ నుంచి మార్చి వరకు రూ.194.68 కోట్ల మద్యం విక్రయాలు జరుగగా, ఈసారి నాలుగు నెలల కాలంలో రూ.206.71 కోట్ల విక్రయాలు జరిగాయి.

మందు బాబుల పరేషాన్‌..
వేసవి ఎండలు ముదరడంతో మద్యం ప్రియులు ఎక్కువగా బీర్లు తాగడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ ప్రస్తుతం నీటి కొరత, బీర్ల ఉత్పత్తి షరతులు తదితర కారణాల వల్ల బీర్ల కొరత ఏర్పడింది. అలాగే బీరు కాలపరిమితి 6 నెలలు ఉండటంతో ఎక్కువ కాలం నిల్వ ఉంచలేని పరిస్థితి. గతేడాది నాలుగు నెలల కాలంలో 2,68,763 కేసులు అమ్మగా, ఈయేడు మార్చి 31 వరకు 2,96,977 కేసులు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం సాధారణ బ్రాండ్లు లభిస్తున్నప్పటికీ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే బ్రాండ్లు దొరకడం లేదు. దీంతో ఇండెక్స్‌కు అనుగుణంగా 20 నుంచి 25 కేసులు లభ్యతను బట్టి ఇస్తున్నారు. అలాగే సామాన్యుడికి అందుబాటు ధర కలిగి, నిత్యం ఎక్కువగా అమ్ముడు పోయే ఓ బ్రాండ్‌ లిక్కర్‌ కొరత కారణంగా దానికి కూడా రేషన్‌ విధించినట్లు మద్యం వ్యాపారులు తెలిపారు.

పెరిగిన 10.50 శాతం
ఎక్సైజ్‌ స్టేషన్ల వారీగా మద్యం అమ్మకాలు చూస్తే గతేడాది నాలుగు నెలలు (డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి) నర్సాపూర్‌లో రూ.7,172.2 లక్షలు విక్రయాలు జరుగగా ఈసారి నాలుగు నెలలు రూ.7,888.2 లక్షలు, మెదక్‌లో గతేడాది రూ.6,847.6 లక్షలు ఉండగా, ఈసారి రూ.6,902.4 లక్షలు, రామాయంపేటలో గతేడాది రూ.5,447.9 లక్షలు కాగా, ఈసారి రూ.5,880.2 లక్షలు విక్రయించాయి. మొత్తం మీద గతేడాది నాలుగు నెలలతో పోలిస్తే ఈసారి జిల్లా వ్యాప్తంగా 6.18 శాతం మద్యం విక్రయాలు వృద్ధి చెందాయి. అలాగే గతేడాది బీర్లతో పోలీస్తే ఈ నాలుగు నెలల్లోనే బీర్ల వినియోగం 10.50 శాతం పెరిగింది. ప్రతీయేటా వేసవి కాలంలో బీరు సరఫరాలో కొరత ఏర్పడుతుంది. డిమాండ్‌ కనుగుణంగా సరఫరా లేక పోవడంతో ప్రధాన బ్రాండ్లపై రేషన్‌ విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!