జూన్ వరకు భగభగలే…
హైదరాబాద్, ఏప్రిల్ 1, ( వాయిస్ టుడే )
Until June, God willing..
ఎయిర్ ఫ్రయర్.. ‘నూనె’తో పనిలేకుండా ఫ్రై చేసి పెట్టే విద్యుత్ పరికరం. ఆరోగ్యం కోసం ఈ మధ్య చాలా మంది దీన్ని వినియోగిస్తున్నారు. ఇది మనం నిర్ణయించిన ఉష్ణోగ్రతలో వేడి గాలిని ఉత్పత్తి చేస్తుంది. ఆ గాలితో లోపలి వస్తువులు వేగిపోతాయి. అంటే మరిగే నూనె అవసరం లేకుండానే కూరగాయలైనా.. మాంసాహారమైనా ‘ఫ్రై’ అయిపోతుందన్నమాట. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే.. భారతదేశం ఓ 2-3 నెలల పాటు ఎయిర్ ఫ్రయర్ గా మారిపోనుంది. వినడానికి అతిశయోక్తిలా ఉన్నా.. వాతావరణ శాఖ హెచ్చరికలు అచ్చంగా అలాగే ఉన్నాయి. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో భారత్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. తెల్లటి మంచు దుప్పటి కప్పుకునే హిమగిరులు సైతం కరిగి పచ్చని పచ్చిక బయటపడుతుంది. ఇది ప్రతి వేసవిలో సర్వ సాధారణమే. కానీ.. ఈ ఏడాది అలా కాదు అంటున్నారు భారత వాతావరణ శాఖ అధికారులు. ఈ వేసవిలో ముఖ్యంగా ఏప్రిల్ – జూన్ మధ్య కాలంలో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు. దేశంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ చీఫ్ మృత్యుంజయ్ మోహపాత్ర వెల్లడించారు.ఏప్రిల్ – జూన్ మధ్య కాలంలో హీట్ వేవ్ (వేడి గాలులు) పరిస్థితులు సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో తలెత్తుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ పరిస్థితి దేశంలోని ఉత్తర, తూర్పు, మధ్య ప్రాంతాలతో పాటు వాయువ్యంలో మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వేసవిలో వడగాలులు సహజమే. అయితే వడగాలులు తలెత్తే పరిస్థితులు రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్నదే ఆందోళన కలిగించే అంశం.హీట్ వేవ్ పరిస్థితుల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యే రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, చత్తీస్‌గఢ్తో పాటు ఉత్తర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో పూర్తి దక్షిణాన ఉన్న కొన్ని ప్రాంతాలు, వాయువ్య దిశలో ఉన్న కొన్ని ప్రాంతాలు మినహా దేశమంతటా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD హెచ్చరిస్తోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సైతం సగటు కంటే ఎక్కువగా ఉంటాయని వెల్లడించింది.వేసవిలో ఎయిర్ ఫ్రయర్‌ను తలపించనున్న భారతదేశంలో విద్యుత్ డిమాండ్ కూడా పెరగనుంది. గత ఏడాది దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయి మార్కు 250 గిగావాట్లను దాటింది. గత ఏడాది మే 30న ఇది సంభవించింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 6.3% అధికం. ఈ లెక్కన ఈ ఏడాది ఇంతకు మించిన విద్యుత్ డిమాండ్ ఏర్పడనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోక తప్పదని వాతావరణ శాఖ హెచ్చరికలను బట్టి అర్థమవుతోంది.ఓవైపు వాతావరణ శాఖ వేడి గాలులు, గరిష్ట ఉష్ణోగ్రతల గురించి హెచ్చరిస్తుంటే.. మరోవైపు సెంట్రల్ వాటర్ కమిషన్ దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిల్వలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసలు సిసలు వేసవి మొదలుకాక ముందే దేశంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు నిండుకునే పరిస్థితికి చేరుకున్నాయి. దేశంలోని 150 ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు వాటి మొత్తం సామర్థ్యంలో 45%కు పడిపోయాయి. మునుపటి ఏడాది కంటే చాలా దిగువకు నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. రుతు పవనాలు ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప రిజర్వాయర్లలోకి కొత్తగా నీరు వచ్చి చేరే పరిస్థితులు లేవు. హిమాలయ నదుల్లో వేసవిలో మంచు కరగడం ద్వారా నీటి లభ్యత ఏమాత్రం తగ్గకుండా కొనసాగుతుంది. కానీ మధ్య భారతం నుంచి దక్షిణాది వరకు ఉన్న నదులన్నీ వర్షాధారమైనవే. వాటిని ఆధారం చేసుకుని నిర్మించిన జలాశయాల్లో నీటి నిల్వలు పెంచే అవకాశం లేదు. ఒకవేళ దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం ప్రక్రియ పూర్తయి ఉంటే.. ఈ పరిస్థితిని నివారించేందుకు ఆస్కారం ఉండేదని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు దక్షిణాది నగరాల్లో నీటి కొరత సమస్య తప్పేలా లేదు.