అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో పెంచిన భద్రత
తిరుమల, ఆగస్టు 16 : తిరుమల ఘాట్ రోడ్డు, నడక మార్గాల్లో వన్యమృగాల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. వన్యమృగాల దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ, భవిష్యత్తులో కాలినడకన, ఘాట్ రోడ్డులో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్య అటవీ శాఖ అధికారులతో సమావేశం అయ్యింది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో చిన్న పిల్లల తల్లిదండ్రులను ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతించేలా చర్యలు చేపట్టింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చిన్నపిల్లలను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. రాత్రి పది గంటల వరకూ పెద్దలకు నడక మార్గంలో అనుమతి ఉంటుందని పేర్కొంది. నడక మార్గంలో వెళ్ళే ప్రతి భక్తుడికి ప్రయోగాత్మకంగా ఊతకర్రలు ఇచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం తిరుమలకు భక్తులు నడక మార్గంలో వెళ్లే భక్తులకు అకస్మాత్తుగా జంతువులు కనిపిస్తే వాటి నుంచి రక్షణ పొందేందుకు ఈ ఊత కర్ర ఇస్తున్నారు. ప్రతి భక్తుని చేతిలో కర్రను ఇచ్చి జాగ్రత్తలు చెప్తున్నారు. అలిపిరి నుండి ఘాట్ రోడ్డులో వెళ్ళే ద్విచక్ర వాహనదారులకు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు వరకే అనుమతిస్తామని స్పష్టం చేసింది. భక్తుల భధ్రత దృష్ట్యా ఎంత మందినైనా అటవీ శాఖా సిబ్బందిని నియమించింది. భక్తులను గుంపులుగా నడక మార్గంలో పంపేందుకు నిర్ణయం తీసుకుంది.
తగ్గిన భక్తుల రద్దీ
నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే అలిపిరి నడకమార్గం నిర్మానుష్యంగా కనిపించింది. తిరుమలలో వన్యప్రాణుల సంచారంతో అలిపిరి నడక మార్గం ఖాళీగా మారింది. నడక మార్గంలో చిరుతపులి (వన్య ప్రాణుల) సంచారంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు అత్యవసరంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిరుత లాంటి వన్య ప్రాణుల సంచారం అదుపులోకి వచ్చేంత వరకూ ప్రతి భక్తుడికి చేతికర్ర అందించేందుకు హైలెవెల్ కమీటీ నిర్ణయం తీసుకుంది. అలిపిరి నడకమార్గంలో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 వరకే తల్లిదండ్రులతో పిల్లలకు అనుమతిని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2 తరువాత అనుమతించడం లేదని చెప్పారు. అయితే తిరుమలలో చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్ల మార్గంలో నిర్మానుష్యంగా మారింది. నిత్యం గోవింద నామ స్మరణతో కిటకిటలాడే అలిపిరి నడకమార్గం, మెట్ల మార్గాల్లో భక్తుల తాకిడి చాలా తగ్గింది. వన్య ప్రాణుల సంచారం ఉన్నందున నడక మార్గంలో వెళ్లే భక్తులకు ఊతకర్ర ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఒకేసారి దాదాపు 100 మంది భక్తులకు గుంపులుగా నడకమార్గంలో పంపిస్తున్నారు. అదే విధంగా భక్తుల భద్రతకు నైపుణ్యం ఉన్న ఫారెస్ట్ సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోనుంది.. నడక మార్గంలోని దుకాణదారుకు వ్యర్ధాలను బయటకు వేయకుండా ఉంచితే చర్యలు తీసుకోవడంతో పాటుగా, అలిపిరి, గాలిగోపురం, 7వ మైలురాయి దగ్గర హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయనుందిఇప్పటికే అలిపిరి నడకమార్గంలో చిరుత సంచరిస్తుండగా.. బాలికపై దాడి చేసి చంపేసిన తరువాత బోనులు ఏర్పాటు చేయడంతో ఒక చిరుత చిక్కింది. అంతలోనే తిరుమలలో మరోసారి ఓ చిరుత కలకలం సృష్టించింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వద్ద చిరుత కనిపించడంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా వేద విశ్వవిద్యాలయంలో రాత్రి చిరుత సంచరించినట్లు గుర్తించారు. వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో చిరుత కనిపించడంతో విద్యార్థులు పరుగులు తీశారు. టీటీడీ అధికారులకు, అటవీశాక అధికారులకు సమాచారం అందించారు.
అంతా పుష్ప వల్లే
తిరుమలలో చిన్నారి లక్షితను బలితీసుకున్న చిరుతలు.. ఇప్పటికీ అక్కడక్కడ సంచరిస్తూ కలకలం రేపుతూనే ఉన్నాయి.. తిరుమలకు వెళ్లే భక్తులతో పాటు స్థానికులకు కునుకు లేకుండా చేస్తున్నాయి.. అయితే, తిరుమలలో చిరుతల సంచారంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు.. వైసీపీ నేతల ఎర్రచందనం స్మగ్లింగ్ వల్లే చిరుతలు నడక మార్గంలోకి వచ్చేస్తున్నాయన్న ఆయన.. వైసీపీలో పుష్పాలు ఎక్కువయ్యారు అంటూ విమర్శించారు. వైసీపీ పుష్పాలు ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా చేస్తున్నారు.. ఎర్ర చందనం కోసం భారీగా అడవులు నరికేయడం వల్లే చిరుతలు తిరుమల మెట్ల మార్గంలోకి వచ్చేస్తున్నాయన్నారు. చిరుత పులిని తరమడానికి బ్రహ్మాండమైన రూళ్ల కర్ర ఇస్తారట అని ఎద్దేవా చేశారు. ఆ రూళ్ల కర్రలతో భక్తులు ప్రభుత్వానికి బడితే పూజ చేయాలని పిలుపునిచ్చారు. భక్తులకు సరైన సమాధానం చెప్పుకోలేక రూళ్ల కర్ర ఇస్తామంటారా..? అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికి పిచ్చి మాటలు.. తుగ్లక్ చేష్టలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు బోండా ఉమ.ఇక, మేం విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం.. వైసీపీ ప్రిజన్ డాక్యుమెంట్ ఇస్తుందని విమర్శించారు బోండా ఉమ.. అభివృద్ధి ఎలా చేయాలో అనేది మా విజన్ డాక్యుమెంట్.. ఎంత మంది జైళ్లకి పంపాలోననేది వైసీపీ ప్రిజన్ డాక్యుమెంట్ అని దుయ్యబట్టారు.. వైసీపీకి విజన్ అంటే అర్థమే తెలియదన్న ఆయన.. అబద్దాలు చెప్పే వైసీపీ అధికారంలోకి వచ్చింది.. చంద్రబాబు అవినీతి చేశాడంటున్న వైసీపీ.. ఈ నాలుగున్నరేళ్లు ఏం పీకారు..? అంటూ మండిపడ్డారు. ఒక్క రూపాయైనా చంద్రబాబు అక్రమంగా దోచుకున్నారని వైసీపీ ఎందుకు నిరూపించ లేకపోయింది.. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారనే సొల్లు పురాణం ఎన్నాళ్లు చెబుతారు..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఎంక్వైరీలు వేసుకున్నా చంద్రబాబు కాలి గోటిని కూడా టచ్ చేయలేకపోయారు. చంద్రబాబు ఏదైనా తప్పు చేస్తే.. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జగన్ ఊరుకునేవాడా..? చంద్రబాబు 420 నా.. అయితే వైసీపీ వాళ్లంతా 840 గాళ్లు… ఏపీలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రూ. 10 లక్షల కోట్ల మేర దోచుకున్నారు. తాగుబోతుల జేబులను కొట్టేసే వైసీపీ.. చంద్రబాబుని విమర్శిస్తారా..? అంటూ విరుచుకుపడ్డారు.సీఎం వైఎస్ జగన్ పని అయిపోయింది.. అందుకే అబద్దాలు చెప్పి మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు బోండా ఉమ.. సీఎం వైఎస్ జగన్ చెప్పే ప్రతిమాట అబద్దమే. నవరత్నాలు అంటూ నవ మోసాలు చేశారన్న ఆయన.. పది మందికిచ్చి.. 90 మందికి పథకాలు ఎగ్గొట్టారని ఆరోపించారు.. ఒంటి మీద మంచి బట్టలున్నా.. పథకాల్లో కోత వేశారంటూ విమర్శలు గుప్పించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు.