3 నెలల పాటు వరంగల్, కరీంనగర్ రోడ్డు బంద్
వరంగల్, ఏప్రిల్ 9
వరదలకు ప్రధాన కారణమైన నయీంనగర్ నాలా విస్తరణ, బ్రిడ్జి పునః నిర్మాణ పనులు షురూ అయ్యాయి. బ్రిడ్జి నిర్మాణ పనుల వల్ల కరీంనగర్ – వరంగల్ మధ్య ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మూడు నెలల పాటు వాహనాలు దారి మళ్లిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాల గుండా వెళ్ళాలని సూచిస్తున్నారు.ప్రస్తుత వాహనాల సంఖ్య క్రమంగా పెరిగింది. గతంలో కట్టిన బ్రిడ్జి రాకపోకలకు సరిపోని పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేగాక ప్రతి వర్షాకాలంలో వరద నీటి ప్రవాహానికి ముంపునకు గురవుతోంది. దీంతోనే కొత్త బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా నయీంనగర్ వద్ద రూ.8.5 కోట్లతో పాత బ్రిడ్జి కూల్చివేసి కొత్తగా నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవలె మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. జూన్ నెలలో వచ్చే వర్షాకాలం దృష్ట్యా.. ఆలోగానే కొత్త బ్రిడ్జి పనులు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ తయారు చేశారు.వరంగల్ నుండి కరీంనగర్ వెళ్ళాలంటే హనుమకొండలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్, నయీంనగర్, కేయూ జంక్షన్ మీదుగా వెళ్ళాలి. ప్రస్తుతం నయీంనగర్ బ్రిడ్జి పునః నిర్మాణ పనులు జరుగున్నాయి. బ్రిడ్జి కూల్చివేత సందర్భంగా ఈ రహదారి మొత్తం మూసివేశారు అధికారులు. మూడు నెలల పాటు ఈ ప్రధాన రహదారి మూసి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మూడు నెలలు వాహనాల దారి మళ్లింపు ఉంటుందని వెల్లడించారు. రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనదారులు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.కరీంనగర్ నుండి ఖమ్మం, నర్సంపేట, వరంగల్ వైపుకు వెళ్లవలసిన భారీ వాహనాలు కేయూ జంక్షన్ నుండి పెగడపల్లిడబ్బాల, పెద్దమ్మ గడ్డ, ఆటోనగర్, మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కరీంనగర్ నుండి వచ్చే RTC బస్సులు కేయూ జంక్షన్ నుండి పెగడపల్లిడబ్బాల, పెద్దమ్మ గడ్డ, ములుగు రోడ్డు జంక్షన్, అమృత జంక్షన్, హన్మకొండ చౌరస్తా మీదుగా బస్టాండ్‌కు చేరుకునేలా రూట్ మ్యాప్ ప్రకటించారు ట్రాఫిక్ సిబ్బంది.ఖమ్మం నుండి వరంగల్ మీదుగా కరీంనగర్ వైపు వెళ్లవలసిన భారీ వాహనాలు ఉరుసుగుట్ట, కడిపికొండ, మడికొండ, ORR మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. వరంగల్, నర్సంపేట వైపు నుండి కరీంనగర్ వైపుకు వెళ్లవలసిన భారీ వాహనాలు MGM సర్కిల్, ములుగు రోడ్డు జంక్షన్, పెద్దమ్మ గడ్డ, పెగడపల్లిడబ్బాల, కేయుసి జంక్షన్ మీదుగా వెళ్లాలని అధికారులు తెలిపారు. హన్మకొండ నుండి కరీంనగర్ వైపు వెళ్ళు RTC బస్సులు హన్మకొండ చౌరస్తా, అమృత జంక్షన్, ములుగు రోడ్డు జంక్షన్, పెద్దమ్మ గడ్డ, పెగడపల్లిడబ్బాల, కేయూ జంక్షన్ మీదుగా వెళ్లేలా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు.వచ్చే వర్షాకాలం వరకు ఓరుగల్లు ప్రజలకు పూర్తిగా వరద ముప్పు నుండి విముక్తి కల్పించే లక్ష్యంతో పనులు చేపట్టారు అధికారులు. అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా ప్రజలు సహకరించాలని స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా ఉన్నతాదికారలు కోరారు.