అంగన్‌వాడీలను ఆధునిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాం :కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

- Advertisement -

అంగన్‌వాడీలను ఆధునిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాం

పోషణతోపాటు ఆరోగ్యం, ప్రీ-స్కూల్, డిజిటల్ విద్యకు ప్రాధాన్యం

9 కోట్ల మందికి పైగా లబ్ధిదారుల సేవలు డిజిటల్ ట్రాకింగ్‌

2 లక్షల అంగన్‌వాడీలను ‘సాక్షమ్ అంగన్‌వాడీ’లుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

We are transforming Anganwadis into modern centers: Union Minister Bandi Sanjay Kumar
We are transforming Anganwadis into modern centers: Union Minister Bandi Sanjay Kumar

కరీంనగర్, అక్టోబర్ 1 (వాయిస్ టుడే): అంగన్‌వాడీ కేంద్రాలను కేవలం పిల్లలకు భోజనం అందించే కేంద్రాలుగా కాకుండా పోషణ, ఆరోగ్యం, ప్రీ-స్కూల్ విద్య, డిజిటల్ మానిటరింగ్‌ అందించే ఆధునిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా 2 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను దశలవారీగా ‘సాక్షమ్ అంగన్‌వాడీ’లుగా ఆధునికీకరిస్తున్నామని చెప్పారు.

నరేంద్రమోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్–జన్ సేవా హీ ప్రభు సేవా’ కార్యక్రమాల్లో భాగంగా గురువారం కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలో ‘అంగన్ మిలన్ సేవా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న పోషకాహారాన్ని పరిశీలించారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, కార్యకర్తలను సన్మానించారు.

గత 12 ఏళ్లలో అంగన్‌వాడీలు, చిన్నారుల పోషణ, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం కోసం రూ.1.77 లక్షల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు బండి సంజయ్ తెలిపారు. సాక్షమ్ అంగన్‌వాడీల్లో వైఫై, ఎల్‌ఈడీ స్క్రీన్లు, ఆర్వో ప్లాంట్లు, స్మార్ట్ లెర్నింగ్ వంటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు.

2021లో ప్రారంభించిన పోషణ్ ట్రాకర్ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలు, కార్యకర్తలు, పిల్లల ఎదుగుదల, హాట్ కుక్డ్ మీల్స్ వంటి సేవలను డిజిటల్‌గా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. 2025 నాటికి 14 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలు, 9 కోట్లకు పైగా లబ్ధిదారులు పోషణ్ ట్రాకర్‌లో నమోదయ్యారని, సుమారు 8 కోట్ల మంది పిల్లల ఎదుగుదలను నెలవారీగా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.

2021–26 మధ్య ఉపాధి హామీ పథకం ద్వారా 50 వేల అంగన్‌వాడీ భవనాల నిర్మాణం చేపడుతున్నామని, ఒక్కో భవనానికి వివిధ కేంద్ర నిధులను కలిపి రూ.12 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. 2025–26లో సాక్షమ్ అంగన్‌వాడీ, పోషణ్ 2.0 అమలుకు రూ.21,960 కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్లు తెలిపారు.

అంగన్‌వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి చిన్నారుల పోషణ, ఆరోగ్యం, విద్యకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బండి సంజయ్ అన్నారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం

అనంతరం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి తీగలగుట్టపల్లి 2వ డివిజన్‌లోని చంద్రపురి కాలనీలో రూ.65.30 లక్షల యూఐడీఎఫ్ నిధులతో చేపట్టనున్న డ్రెయిన్ పైప్‌లైన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. స్థానిక ఎంపీపీఎస్, జిల్లా పరిషత్ పాఠశాలలో రూ.1.05 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మౌలిక వసతుల నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, మహిళా మోర్చా జిల్లా నాయకురాలు నిర్మలారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవలందించిన పలువురికి బండి సంజయ్ సర్టిఫికెట్లు అందజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular