
Who is Hydra..!
From criticism to praise!
వారెవ్వా హైడ్రా..!
విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
హైదరాబాద్, ఫిబ్రవరి 20, (వాయిస్ టుడే)
Who is Hydra..! From criticism to praise!
హైదరాబాద్‌లో దశాబ్దాల చరిత్ర కలిగిన చెరువులను ఆక్రమణ కోరల నుంచి రక్షించే మహా సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా యాక్షన్ మొదలైన తొలిరోజుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎంతలా అంటే హైడ్రా హైస్పీడ్ యాక్షన్ ఏకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవ్వడమే కాదు, ప్రతిపక్షాలకు పోరాట అస్త్రాలను ఇచ్చింది. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్ నేతృత్వంలో మొదటి నుంచి వేసిన ప్రతీ అడుగూ వివాదమే అయింది. ప్రతీ కూల్చివేతలో రాజకీయ రాద్దాంతమే జరిగింది. నాగార్జున ఎన్‌కన్వెషన్ మొదలు బడా బాబుల భవంతులు, పేరు మోసిన నిర్మాణాల వరకూ ఎవర్నీ వదల్లేదు హైడ్రా. మీడియా ఉతికి ఆరేసినా, ప్రతిపక్షాలు ఏకిపారేసినా.. డోన్ట్ కేర్ అంటూ హైస్పీడ్ బుల్డోజర్‌లా దూసుకెళ్లింది. హైడ్రాకు హైకోర్టు బ్రేక్‌లు వేసింది. సెలవురోజుల్లో కూల్చివేతలు ఎందుకంటూ నిలదీసింది. నలువైపుల నుంచి వచ్చిన విమర్సలు ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా హైడ్రా స్పీడ్ తగ్గింది. వ్యూహం మారింది. ఇప్పుడు ఆచి తూచి అడుగులేస్తూ యాక్షన్‌లోకి దిగుతోంది. హైడ్రా కూల్చివేతల వల్ల ఎంతో మంది ఇళ్లు కోల్పోయారు. భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఇంత జరుగుతున్నా హైడ్రా మాత్రం మా లక్ష్యం చెరువుల పునరుద్దరణ, భావితరాల భవితవ్యం అంటూ చెప్పుకొస్తోంది. నేటీకి అదే సంకల్పంతో ముందుకు సాగుతోంది. తాజాగా జరిగిన ఓ ఘటన హైడ్రా లక్ష్యం సరైనదే, విమర్శలను ఎదిరించిన చేసిన పనిలో న్యాయమైందే అని నిరూపించింది. బతుకమ్మ కుంట చెరువు హైడ్రా చర్యలను సమర్థించింది. అంబర్‌పేట మండలంలోని బాగ్ అంబర్ పేటలో ఉన్న బతుకమ్మ కుంట చెరువు దాదాపు ఎనభై శాతంపైగా ఆక్రమణకు గురైంది. 16 ఎకరాలు చెరువు కాస్తా 5 ఎకరాలకు వచ్చింది. అది కూడా పూర్తిగా ముళ్లకంచెలతో నిండిపోయి. దీన్ని కూడా కబ్జాదారులు హస్తగతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో స్థానికులు సమస్యను హైడ్రాకు చేరవేశారు. మా బతుకమ్మ కుంటను బతికించండి అంటూ వేడుకున్నారు. రంగంలోకి దిగిన హైడ్రా బుల్డోజర్‌లు ఈసారి చెరువు ఆక్రమించి ప్రాంతాన్ని వదిలేసి మిగతా ప్రాంతంలో ముళ్లకంచెలు తొలిగించేందుకు రెడీ అయింది. అలా బుల్డోజర్లు భూమిని తాకగానే గంగమ్మ ఉబికి వచ్చింది. ఇన్నాళ్లు నన్ను మింగిన ఆక్రమణలు, కబ్జా తిమింగలాల నుంచి రక్షించడానికే వచ్చావా హైడ్రా అంటూ ఆనందంతో పరవళ్లు తొక్కింది. ఇక్కడ చెరువు లేదు అన్నవాళ్ల నోళ్లు మూయించేలా బతుకమ్మకుంటలో దాగిన నిజం వెలుగులోకి వచ్చింది. తొలిరోజుల్లో హైడ్రా అయితే చెరువు ఆక్రమించి కట్టిన ఇళ్లు కూల్చివేసి 16 ఎకరాల చెరువును వెలుగులోకి తెచ్చేది కానీ మారిన హైడ్రా అలాంటి సాహసం చేయలేదు. మిగలిన 5 ఎకరాలు బాగుచేసి చెరువును సుందరీకరణ చేసే పనిలో నిమగ్నమైంంది. ఈ బతుకమ్మ కుంట చెరువు వద్ద ఉబికి వచ్చిన నీరు అనేక ప్రశ్నలకు సమధానం మాత్రమే కాదు… హైడ్రాను తిట్టిపోస్తున్న గొంతుకులకు ఆనకట్ట కట్టింది. హైడ్రా అన్ని చెరువులను రక్షిస్తే, పాతాళంలో దాగిన భూగర్భ జలాలు పైకి ఉబికి కుంటలు, చెరుల కొత్త జీవం పోసుకుంటే ఓసారి ఊహించండి. భారీ వర్షాలకు ముంపు అనే మాట కనుచూపుమేరలో వినపడుదు. తాగునీటి సమస్యకు సైతం పరిష్కారం చూపడమేకాదు, భావి తరాలకు బంగారు భవిష్యత్ ఇవ్వొచ్చు. ఇదే కదా హైడ్రా చెప్పింది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అదేకదా ఇప్పుడు బతుకమ్మ కుంటతో రుజువైందని అంటున్నారు. అందుకే విమర్శించిన గొంతులు సైతం ఇప్పుడు వారెవ్వా హైడ్రా అంటున్నాయి.