విజయం ఎవరిది?
ఉత్కంఠగా జనగామ రాజకీయం
అభ్యర్థిని తేల్చని బీఆర్‌ఎస్
కాంగ్రెస్ టికెట్ లొల్లి
బీజేపీలోనూ భారీగానే ఆశావహులు
జనగామ: ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న, ఉత్కంఠకు గురి చేస్తున్న నియోజకవర్గం జాబితాలో నిలుస్తున్నది జనగామ. అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఈ నియోజకవర్గంలో అభ్యర్థి పేరును పెండింగ్‌లో పెట్టడం దీనికి ప్రధాన కారణం కాగా.. మరోవైపు కాంగ్రెస్, బీజేపీల్లో సైతం టికెట్ కోసం అంతర్గత పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇస్తారు? ఎవరు ముందంజలో నిలిచే అవకాశం ఉందనే అంశాలపై విశ్లేషణాత్మక కథనం..
బీఆర్‌ఎస్.. పల్లాకే ప్రాధాన్యం
అధికార బీఆర్‌ఎస్ పార్టీని పరిగణనలోకి తీసుకుంటే.. సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఈ సారి పక్కన పెడతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. పల్లాతో పాటు మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కూటా టికెట్ ఆశిస్తున్నారు. దీంతో బీఆర్‌ఎస్ టికెట్ ఎవరికి అనేది ఆసక్తిగా మారింది.
పల్లాకు.. అధినేత ఆశీస్సులు
నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డితోపాటు ముగ్గురు టికెట్ రేసులో ఉన్నప్పటికీ.. అధినేత ఆశీస్సులు మాత్రం పల్లా రాజేశ్వర్ రెడ్డికే ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై ముందుగానే సంకేతాలు అందుకున్న పల్లా.. నియోజకవర్గంలో ప్రచార పర్వం ప్రారంభించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే పల్లాకు టికెట్‌పై స్థానిక బీఆర్‌ఎస్ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. సొంత పార్టీ నేతలే ఆయనపై విమర్శలకు దిగుతున్నారు. విద్యా రంగాన్ని ప్రైవేటీకరణ చేయడంలో పల్లా కారణమని.. అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వొద్దంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు.
ఒక్కటైన.. ముత్తిరెడ్డి, పోచంపల్లి
పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇస్తున్నారనే వార్తల నేపథ్యంలో నియోజకవర్గంలో ముత్తిరెడ్డి, పోచంపల్లి వర్గాలు ఒక్కటయ్యాయి. గత విభేదాలను మరిచి.. రెండు వర్గాలు కలిసి పని చేయడం మొదలు పెట్టాయి. ముత్తిరెడ్డి సైతం తనకు కాకున్నా.. పోచంపల్లికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్‌లో కొమ్మూరి వర్సెస్ పొన్నాల
ఇక.. కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశిస్తున్న వారిలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల ముందున్నారు. ఆయన బీసీ కార్డ్ ఉపయోగించుకుని టికెట్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా.. గత రెండు ఎన్నికల్లోనూ పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసి.. ఓడినా.. ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నానని.. తానే బరిలో దిగుతాననని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఇదే సమయంలో జనగామ టికెట్‌ను పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఇస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిని పొన్నాల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని, జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరిని నియమించడమే పొరపాటని ఆయన ఢిల్లీ పెద్దలకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆయన కినుక వహిస్తున్నారు. అంతేకాకుండా.. గతంలో తన చేతిలో ఓటమి పాలైన కొమ్మూరికి తనను కాదని టికెట్ ఇస్తే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని చెబుతున్నట్లుగా కూడా తెలుస్తోంది.
బీజేపీ చిట్టా పెద్దదే
మరో ప్రధాన పార్టీ బీజేపీలో సైతం టికెట్ ఆశిస్తున్న వారు ఎక్కువగానే కనిపిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దశమంత రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ముక్కెర తిరుపతి రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గాడిపల్లి ప్రేమలతా రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వీరితోపాటు బేజాటి బీరప్ప కూడా టికెట్ రేసులో ఉన్నారు. వీరు ఎవరికి వారు రాష్ట్ర స్థాయి నేతలు ఈటెల, బండి సంజయ్‌ల వద్ద టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. గతంలో బండి వర్గం నేతలుగా పేరొందిన వారిలో.. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా రావడంతో టెన్షన్ పెరుగుతోంది. దీంతో.. వారు కిషన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు తమ శైలిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
జోష్ పెంచిన కిషన్ రెడ్డి పర్యటన
నియోజక వర్గంలో బీజేపీ కాస్త అనుకూలంగా ఉన్న అంశం.. ఇటీవల ఈ ప్రాంతంలో కిషన్ రెడ్డి పర్యటించడం. గత నెలలో వరదల ముంపు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ఆ సందర్భంగా ప్రభుత్వ సహాయక చర్యలపై విమర్శలు చేయడం, పార్టీ తరఫున ప్రజలకు సదుపాయాలు కల్పించడం పార్టీ శ్రేణుల్లో కొంత జోష్ పెంచింది. అంతేకాకుండా బండి సంజయ్ పాదయాత్ర కూడా నియోజకవర్గంలో విజయవంతంగా ముగియడం కూడా ఆ పార్టీకి అనుకూల అంశంగా మారింది. దీంతో.. పార్టీకి నియోజకవర్గంలో ఆదరణ లభిస్తుందనే ఆశాభావాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.
బీసీ ఓట్లే కీలకంగా
ఇక.. సామాజిక వర్గాల వారీగా సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇక్కడ కూడా ఈ సారి బీసీ ఓట్లే కీలకంగా మారనున్నాయి. అంతేకాకుండా.. బీసీ వర్గాల పెద్దలు కూడా ఈసారి తమ వర్గానికి చెందిన నేతలకే ఓటు వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కారణంతో కాంగ్రెస్ నుంచి పొన్నాల టికెట్ కోసం పట్టు బడుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు రెడ్డి సామాజిక వర్గంకే టికెట్ ఇచ్చారని.. ఈ సారి బీసీ వర్గాలకు టికెట్ ఇవ్వాలని అధికార బీఆర్‌ఎస్‌పైనా ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది. అయితే.. బీఆర్‌ఎస్ అభ్యర్థిని తేల్చిన తర్వాత తమ అభ్యర్థిని ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి.
మొత్తంమీద.. రాష్ట్రంలో ఉత్కంఠకు కేరాఫ్‌గా నిలిచిన జనగామలో రానున్న ఎన్నికల్లో జయం ఎవరిదనేది ఉత్కంఠగా మారింది. పల్లాకు టికెట్ ఇస్తే అధికార పార్టీకి విజయావకాశాలు మందగిస్తాయని.. కానీ.. కాంగ్రెస్, బీజేపీలలోని వర్గ పోరులు బీఆర్‌ఎస్ కలిసొస్తాయనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.
జనగామ నియోజకవర్గం ముఖ్యాంశాలు
మొత్తం ఓట్లు: దాదాపు 2.25 లక్షల ఓట్లు
ఎస్‌సీ ఓట్లు: దాదాపు 45 వేలు
బీసీ ఓట్లు: దాదాపు లక్షన్నర
కీలకంగా మున్నూరు కాపు,ముదిరాజ్ ఓట్లు.