Friday, April 4, 2025

గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో సత్తాచాటిన మహిళలు

- Advertisement -

గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో సత్తాచాటిన మహిళలు
హైదరాబాద్, మార్చి 31, (వాయిస్ టుడే)

Women who excelled in Group-1 Mains results

తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టులకు సంబంధించిన జనరల్ ర్యాంకు జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 30న విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 మెయిన్స్‌లో ఏడు పేపర్లకు హాజరైన అభ్యర్థుల ప్రాథమిక మార్కుల జాబితాను మార్చి 10న వారి వ్యక్తిగత లాగిన్‌లలో టీజీపీఎస్సీ పొందుపర్చి, అభ్యర్థుల నుంచి మార్చి 24 వరకు రీకౌంటింగ్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించింది. పునఃలెక్కింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో.. పరీక్షకు హాజరైన 21,085 మంది అభ్యర్థుల మార్కులను తాజాగా ప్రకటించింది. అర్హత పరీక్ష ఇంగ్లిష్‌తో పాటు ప్రధాన పరీక్షలైన ఆరు పేపర్ల మార్కులను వెల్లడించింది. జీఆర్‌ఎల్‌లో మార్కులు, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేస్తామని కమిషన్ వెల్లడించింది. గ్రూప్-1 మెయిన్ పరీక్షలను గతేడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు నిర్వహించారు. ఈ ఫలితాల్లో మహిళలు సత్తాచాటారు. తొలి వంద ర్యాంకుల్లో 41 మంది మహిళలు ఉండటం విశేషం. అందులోనూ టాప్-10లో ఆరుగురు, టాప్-50లో 25 మంది మహిళలు ఉన్నారు. ప్రధాన పరీక్షల్లో (అర్హత పరీక్ష ఇంగ్లిష్ మినహా) 500కి పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు 52 మంది ఉన్నారు. టాప్-3 ర్యాంకరుతో పాటు టాప్-100లో ఐదుగురు తెలంగాణ స్థానికేతర అభ్యర్థులు ప్రతిభ చాటారు.
ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులే అధికం..
గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అధికంగా ఉన్నారు. పరీక్షకు హాజరైన 20,161 మందిలో 12,323 మంది ఆంగ్ల మాధ్యమం.. 7,829 మంది తెలుగు.. 9 మంది ఉర్దూ మాధ్యమ అభ్యర్థులు ఉన్నారు. గ్రూప్-1లో సమాన మార్కులు వచ్చిన అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే కేవలం 0.5 మార్కుల తేడాతో పలువురు జీఆర్‌ఎల్‌లో కొన్ని ర్యాంకులు వెనుకబడ్డారు.

ఏప్రిల్ 28 వరకు అందుబాటులో..
అభ్యర్థుల వ్యక్తిగత మార్కుల మెమోను వెబ్‌సైట్ వ్యక్తిగత లాగిన్‌లలో పొందుపరిచామని, హాల్‌టికెట్, టీజీపీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు, ఓటీపీ నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. మార్కుల మెమోలు ఏప్రిల్ 5 వరకు వారం రోజుల పాటు, జనరల్ ర్యాంకు జాబితా ఏప్రిల్ 28 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని కమిషన్ తెలిపింది. హైకోర్టు ఆదేశాలకు లోబడి ప్రధాన పరీక్షలకు హాజరైన అభ్యర్థుల మార్కుల వివరాలను న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రకటించలేదని పేర్కొంది.

టాపర్ల వివరాలు ఇలా..
➥ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో మొత్తం 900 మార్కులకు గాను 550 మార్కులతో హైదరాబాద్ ఏఎస్‌రావు నగర్‌కు చెందిన లక్ష్మీదీపిక కొమ్మిరెడ్డి రాష్ట్ర టాపర్‌గా నిలిచారు. మల్టీజోన్-2లోనూ ప్రథమ స్థానం సాధించారు. ఆమె ఉస్మానియాలో వైద్యవిద్య పూర్తి చేశారు. యూఎస్‌ పోదామనుకుని.. కానీ రద్దు చేసుకుని యూపీఎస్సీ ప్రిపరేషన్‌ మొదలుపెట్టినట్లు ఆమె తెలిపారు. సివిల్స్‌కు ప్రిపేర్‌కావడం గ్రూప్‌-1కు కలిసొచ్చిందని, గ్రూప్‌-1కు ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదని తెలిపింది. 80 శాతం సిలబస్‌ కామన్‌గా ఉండటంతో సులభమైంది. 20శాతం తెలంగాణ అంశాలను జాగ్రత్తగా ప్రిపేరైనట్లు లక్ష్మీ తెలిపారు.

➥ నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535.5 మార్కులతో రెండో ర్యాంకు సాధించారు. గత ఆరేళ్లుగా సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమవుతున్న వెంకటరమణ.. గ్రూప్-1 మొదటి ప్రయత్నంలోనే సత్తా చాటడం విశేషం. ఆయన తండ్రి శ్రీనివాసరావు నల్గొండలో టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ ఏఈగా, తల్లి రమాదేవి ఎస్‌జీటీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అమ్మానాన్నల ప్రోత్సాహమే తన విజయానికి ముఖ్య కారణమని వెంకటరమణ తెలిపారు. సమాజ సేవ చేయాలనే ఆకాంక్ష తన లక్ష్యసాధనకు దోహదపడిందని చెప్పారు. ఇంటి వద్దే ఉండి సన్నద్ధమైన ఆయన.. ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించిన జూనియర్ లెక్చరర్ సివిక్స్ పోస్టుకు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికయ్యారు. గ్రూప్-2లో 378వ ర్యాంకు సాధించారు.

➥ మల్టీ జోన్‌-1 కేటగిరీలో హనుమకొండ జిల్లాకు చెందిన తేజస్వినిరెడ్డి 532.5 మార్కులతో టాపర్‌గా నిలిచారు. మొత్తం మీద నాలుగో ర్యాంకు సాధించారు. ఆమె ప్రస్తుతం మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.

➥ రంగారెడ్డి జిల్లా మీర్‌పేట కార్పొరేషన్ జిల్లెలగూడకు చెందిన సిద్ధాల కృతిక గ్రూపు-1లో 532 మార్కులతో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృతిక తల్లి సిద్ధాల లావణ్య గతంలో సరూర్ నగర్ మండల పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేశారు. తండ్రి బీరప్ప భారాస నాయకుడు. 2017లో డిగ్రీ పూర్తి చేసిన కృతిక.. మొదట సివిల్స్‌కు సిద్ధమయ్యారు. వరుసగా నాలుగుసార్లు పరీక్ష రాసినా మంచి ర్యాంకు రాలేదు. 2022లో గ్రూప్-1 నోటిఫికేషన్ రాగా పరీక్ష రాశారు. ర్యాంకు రాకపోవడంతో 2024లో మరోసారి గ్రూప్-1, గ్రూప్-4 రాశారు. గ్రూప్-4లో 511వ ర్యాంకు సాధించి వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరారు. తాజాగా గ్రూప్-1లో రాష్ట్రస్థాయి ఐదో ర్యాంకు రావడంతో తన ఏడేళ్ల కృషికి ఫలితం దక్కిందని కృతిక సంతోషం వ్యక్తం చేశారు. సివిల్స్‌పై ఇష్టంతో చదివాను. గ్రూప్-1 పరీక్షకు ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చదివాను అని ఆమె తెలిపారు. కృతికకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు.

➥ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన పూనాటి రాజ్యలక్ష్మి-తిరుపతిరావుల కుమారుడైన హర్షవర్ధన్ గ్రూప్-1లో రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు, మల్టీ జోన్-2 స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించి సత్తాచాటారు. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. రూ.27 లక్షల వార్షిక వేతనంతో ఓ ప్రైవేట్ సంస్థలో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. అనంతరం రాజీనామా చేసి యూపీఎస్సీకి సన్నద్ధమయ్యారు. గతేడాది గ్రూప్-1 పరీక్షకు ప్రిపేర్ అయ్యారు.

➥ ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మానసపల్లికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ కుమార్ రాష్ట్రస్థాయిలో 105వ ర్యాంకు సాధించారు. ఆయన చిన్నప్పుడే అమ్మానాన్నలు మృతిచెందడంతో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే నాయనమ్మలు సమ్మక్క, ఎల్లమ్మలు తోడుగా నిలిచారు. ప్రవీణ్ ఉస్మానియాలో బీటెక్ పూర్తి చేశారు. నాలుగేళ్లుగా బంజారాహిల్స్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉంటూ సివిల్స్‌కు సిద్ధమయ్యారు. తాజాగా గ్రూప్-1 ర్యాంకర్‌గా నిలిచారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్