నేటి భారతదేశ న్యాయ వ్యవస్థ లో అమలవుతున్న గొప్ప సంస్కరణలకు ఆద్యడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని బీసీ రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి కారకులు, అతి సామాన్య పేద కుటుంబం లో పుట్టి భారతదేశంలో ప్రధానమంత్రి తరువాత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన న్యాయ శిఖరం జస్టిస్ పుంజాల శివ శంకర్ 94 వ జయంతోత్సవాలు.
హైదరాబాద్ జిల్లాలోని శంషాబాద్ మండలం మామిడిపల్లి గ్రామంలో పేద మున్నూరు కాపు దంపతులు పుంజాల భాషయ్య సత్తమ్మ లకు 11 మంది సంతానం లో రెండవ వారు శివ శంకర్ . ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో బతుకుతెరువు కోసం జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సాధారణ జీవనం గడుపుతూ అమృత్ సర్ లో బి.ఏ. పట్టా పొంది హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎల్ ఎల్ బి పూర్తి చేసి 25 ఏండ్లకే లాయర్ గా జీవితాన్ని ప్రారంభించిన శివ శంకర్ 1950 సంవత్సరంలో లక్ష్మిబాయిని పెళ్లి చేసుకొన్నారు. వారికి ఇద్దరు కుమారులు మరియు ఒక కూతురు. ఎన్నో కష్టాల సుడిగుండాలు దాటి మొక్కవోని దీక్షతో అంచెలంచెలుగా ఎదిగిన మహోన్నత వ్యక్తి శివ శంకర్ . 1950 లో హైదరాబాద్ మేయర్ మాడపాటి హనుమంతరావు దగ్గర పి.ఏ. గా పని చేసారు.1965 లో బార్ కౌన్సిల్ సభ్యులుగా,1969 లో ప్రభుత్వ ప్లీడర్ గా మరియు 1974 నాటికే హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 1977 లో హైకోర్ట్ జడ్జి గా నియమితులైనారు. హైకోర్టు లో ఆధిపత్య వర్గాల కుట్రలు కుతంత్రాలను చూసి జడ్జి పదవికి రాజీనామా చేయడం జరిగింది. కేంద్ర న్యాయ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. హైకోర్టు జడ్జిలలో అంతరాష్ట్ర బదిలీల విధానానికి శ్రీకారం చుట్టారు.ప్రతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి అలాగే 1/3 వంతు న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారై ఉండాలి అనే నిబంధనల వల్ల కొన్ని కులాల అధిపత్య నియామకాలకు చరమగీతం పాడారు. జడ్జిల నియామకపు నిబంధనలు సవరించి దళిత బహుజన వర్గాలు అవకాశం పొందేలా మార్పులు చేసారు.శివశంకర్ గారు డబ్బు లేని పేదవారికి న్యాయాన్ని చట్టాన్ని చేరువ చేసేందుకు దేశమంతా ఉచిత న్యాయ సలహా కేంద్రాలను ప్రారంభంచేసారు. దళిత బిడ్డ జస్టిస్ రామస్వామి 1974 లో హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్ గా మరియు సుప్రీంకోర్టు న్యాయవాదిగా నియామకం కావడానికి దోహదం చేసారు.అలాగే కేరళ హైకోర్టు న్యాయవాది కే జి బాలకృష్ణన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం కావడం లో శివశంకర్ పాత్ర గొప్పది. జస్టిస్ పోలవరపు రామారావు, జస్టిస్ బిక్ష్మయ్య గౌడ్, జస్టిస్ ఎమ్ ఎన్ రావు, జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్, జస్టిస్ బి ఎస్ ఏ స్వామి, జస్టిస్ సర్దార్ అయూబ్ ఖాన్, జస్టిస్ శ్యాం అహ్మద్ ఖాన్ మరియు జస్టిస్ మీనా కుమారి లాంటి వారు జస్టిస్ స్థాయికి చేరుకోవడానికి శివశంకర్ కృషి ఘననీయం.” పుంజాల శివశంకర్ తరువాత భారత న్యాయవ్యవస్థ లో సంష్కరణలు ఆగిపోయావి “అని మజ్లిస్ పార్టీ అధ్యక్షులు న్యాయవాది పార్లమెంట్ సభ్యులు సలావుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు అంటే న్యాయ వ్యవస్థ లో శివశంకర్ పాత్ర ఎలాంటిదో అర్ధం అవుతుంది.
ఇందిరా గాంధీపై ఉన్న కేసులను వాదించి మేటి వకీలుగా ఖ్యాతిని గడించారు.1978 ఉప ఎన్నికలు మరియు 1980 ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి గెలిచి ఇందిరాగాంధీ కాబినెట్ లో న్యాయ శాఖా మంత్రిగా పని చేసారు. రెండవ సారి విదేశీ వ్యవహారాల శాఖ కు, మానవ వనరుల అభివృద్ధి శాఖకు మరియు పెట్రోలియం శాఖ కు మంత్రి గా ఉండి సమర్థవంతమైన విధులు నిర్వహించారు. 1985 ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నుండి ఓడిపోయినా కూడా గుజరాత్ నుండి 1985 మరియు 1993 లలో రాజ్యసభ కు ఎన్నికై ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా పని చేసారు.అలాగే రాజ్యసభ లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు గా వ్యవహరించారు.1994 లో సిక్కిం గవర్నర్,1995 లో కేరళ గవర్నర్ గా భాద్యతలు నిర్వహించారు.1998 లో గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అఖిల భారత బీసీ విభాగం అధ్యక్షులు గా భాద్యతలు నిర్వర్తించి 2004 ఎన్నికల్లో బీసీ నాయకులకు సరైన ప్రాతినిధ్యం దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కు రాజీనామా చేసారు.2008 లో మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడంలో,’ సామాజిక న్యాయం’ నినాదం ఇవ్వడంలో , దేవేందర్ గౌడ్ లాంటి వారు ప్రజారాజ్యం పార్టీలో భాగస్వాములు కావడంలో ప్రధాన పాత్ర పోషించారు.
విదేశాంగ మంత్రి గా ఉన్నప్పుడు నేపాల్ బాంబ్ విస్పోటనం తరువాత నేపాల్ దూతగా ఖాత్మాండు సందర్శించి సమస్యకు పరిష్కారం చూపారు. అలాగే బాంగ్లాదేశ్ తో గంగానది జల వివాదాల సమస్యకు పరిష్కారం చూపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సైద్ధాంతిక విలువల ప్రాతిపదికన కాకుండా దేశ ఆర్ధికాభివృద్ధి కోణాన్ని చేర్చిన వారు శివశంకర్ . మానవ వనరుల శాఖా మంత్రి గా కేంద్రియ విద్యాలయాల ఏర్పాటు మరియు విస్తరణ కు విశేష కృషి చేశారు.గల్ఫ్ లోని ప్రవాస భారతీయుల కోసం పరిశ్రమల మండలి ఆధ్వర్యంలో ఒక సలహా కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. పెట్రోలియం శాఖా మంత్రి గా ఉన్నప్పుడు గ్యాస్ ఏజెన్సీ లను క్రమభద్దీకరించి ఎందరో దళితులు మరియు బీసీ లకు పెట్రోల్ బంకు లు గ్యాస్ ఏజెన్సీ లను ఇప్పించి ఆర్థిక సాధికారికతకు సహకారం ఇచ్చారు.మహిళా బిల్లు లో ఎస్ సి, ఎస్ టీ, బీసీ మహిళలకు కోటా ఇచ్చేంత వరకు మహిళా బిల్లు కు మద్దత్తు ఇచ్చే ప్రసక్తే లేదని ప్రకటించిన వ్యక్తి శివశంకర్ . ఇలా శివశంకర్ రాజకీయంగా శక్తివంతమైన నాయకులుగా ఉండి అన్ని వర్గాల అభివృద్ధికి ప్రత్యేకించి దళితులు మరియు వెనకబడిన వర్గాల సంక్షేమముకు ఎనలేని కృషి చేసారు.
శివశంకర్ ముల్కి నిబంధనల విషయంలో హైకోర్టు కేసును కొట్టివేస్తే సుప్రీంకోర్ట్ కు వెళ్లి ప్రత్యేక తెలంగాణ వాదానికి పునాది వేసిన నిజమైన తెలంగాణ వాది.బీసీ కులాల అభ్యున్నతికి వారి సంక్షేమానికి న్యాయబద్ధమైన రిజర్వేషన్లు అమలుకు అహర్నిశలు కృషి చేసిన ఆత్మబంధువు పుంజాల శివశంకర్ . శివశంకర్ చొరవతో 1969 లోనే బీసీ అభివృద్ధి కి అనంత రామన్ కమిషన్ ఏర్పాటు అయి 30 శాతం రిజర్వేషన్లు సూచిస్తే కొందరు అధిపత్య కులాల వర్గాలు కుట్రలు పన్ని కొన్ని కులాలను బీసీ జాబితా నుండి తీసివేస్తే సుప్రీం కోర్ట్ లో కేసు వేసి పోరాడి విజయం సాధించడం జరిగింది. 1972 లో అప్పటి ముఖమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి బీసీ లకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే వాటికి వ్యతిరేకంగా 110 పిటిషన్లు దాఖలు అయితే బీసీ ల హక్కులు మరియు అవకాశాల కోసం తన స్వంత ఖర్చులతో 18 నెలలు ఢిల్లీ లో ఉండి సుప్రీంకోర్ట్ లో కేసును వాదించి విజయం సాధించారు. శివశంకర్ కృషితో తెలుగు రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్లలో ఏ బి సి డి వర్గీకరణ విధానం అమలైనది. 1978 లో ఏర్పాటైన మండల్ కమిషన్ పదవీకాలం ముగుస్తుండడంతో న్యాయ శాఖా మంత్రిగా ఇందిరాగాంధీతో ఒప్పించి పదవీ కాలం పొడిగింపుకు కారణం అయ్యారు. న్యాయశాఖా మంత్రిగా కమిషన్ ముందు హాజరై వెనకబడిన తరగతులకు (బీసీ ) అదనపు సహాయక వ్యవస్థ ఉండాలని ప్రతిపాదించారు. 1980-89 వరకు మండల్ కమిషన్ సిపారస్ లను పరిశీలించడానికి శివశంకర్ ప్రభుత్వ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఆ కమిటీ చైర్మన్ పి వి నర్సింహా రావు కు శివశంకర్ ఎన్ని అభ్యర్థనలు చేసినప్పటికి మండల్ కమిషన్ సిపార్సుల అమలుకై ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. రాజ్యసభ లో ప్రతిపక్ష నేతగా శివశంకర్ సలహాలను చేర్చిన తరువాతే మండల్ నివేదికను పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది.రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు గా 1990 ఆగస్టు 6 న మండల్ సిపార్సులను అమలు చేయాలనీ దాదాపు రెండు గంటలకు పైగా మాట్లాడారు.మండల్ సిపార్సులను అమలు చేయడంలో శివశంకర్ భాగస్వాములు అయ్యారని స్వయంగా అప్పటి ప్రధానమంత్రి వీ పి సింగ్ నే పేర్కొన్నారు. వీ పి సింగ్ ప్రధానిగా ఆగస్టు 7, 1990 న చారితాత్మక మండల్ కమిషన్ నివేదికలోని 40 సిపార్సులలో ఒక సిపార్సులోని పాక్షిక భాగం అమలు పరుస్తూ “కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీ లకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు” ప్రకటించగానే అదే రోజు శివశంకర్ ” అసలు చదువులో ఓబీసీ రిజర్వేషన్లు లేనిది ఓబీసీ లు ఉద్యోగాల వరకు ఎలా వెల్లగల్గుతారు అని పార్లమెంట్ లో ప్రశ్నించారు. శివశంకర్ కృషి ఫలితంగా 2008 సంవత్సరం లో ఓబీసీ లకు కేంద్రియ విద్యా సంస్థలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. శివశంకర్ గారు అప్పటి సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి సీతారాం కేసరితో ఉన్న సన్నిహిత్యంతో 1993 లో వెనకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు అయినది. శివశంకర్ రూపొందించిన నియమాలలో కమిషన్ స్వయం స్వతంత్రత ఉండాలన్న సిపార్సు మినహా అన్ని నియమాలను ఆమోదించడం జరిగింది. బీసీ నాయకులైన కొండా లక్ష్మణ్ బాపూజీ, సర్దార్ గౌతు లచ్చన్న వారితో కలసి తిరుపతి లో వెనకబడిన తరగతుల సమావేశానికి పిలుపునిస్తే, అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు మురళి ధర్ రావు కమిషన్ నివేదికను అమలు చేయాలనీ ఆదేశించారు.
పుంజాల శివశంకర్ దళితులు ,బడుగు బలహీన వర్గాలు మరియు పేదల అభివృద్ధి మరియు సంక్షేమం నిరంతరం పోరాడి విజయం సాధించిన మహోన్నత వ్యక్తి. సామజికంగా,రాజకీయంగా, ఆర్థికంగా మరియు న్యాయపరంగా అట్టడుగు వర్గాలకు అవకాశాలు కల్పించడంలో ఎనలేని కృషి చేయడం జరిగింది. న్యాయ శాఖలో, విదేశాంగ శాఖలో విప్లవాత్మక మార్పులు చేపట్టి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన సంష్కర్త న్యాయ శిఖరం శివశంకర్ . బీసీ ల వెనకబాటు తనాన్ని పొగట్టడానికి,బీసీ రిజర్వేషన్లు అమలు పరచడానికి,మండల్ కమిషన్ నివేదిక సిపార్సులు అమలు చేయడానికి, ఓబీసీ కమిషన్ ఏర్పాటు కు మరియు కేంద్రీయ విద్యా సంస్థలలో రిజర్వేషన్లు అమలుకు నిజాయితీ గా చిత్తశుద్ధి తో పోరాడి విజయం సాధించిన సంక్షేమ శిఖరం పుంజాల శివశంకర్. పుంజాల శివశంకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి సాధించిన విజయాలను అన్ని వర్గాలకు తెలియచేబుతూ వారి ఆశయాలను భవిష్యత్ తరాలు కొనసాగించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ కోరుకుంటున్నాను.
డాక్టర్ బాల శ్రీనివాస్ పటేల్
అర్ధశాస్త్ర సహాయ ఆచార్యులు
రాష్ట్ర అధ్యక్షులు : తెలంగాణ మున్నూరు కాపు
ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల
సంక్షేమ సంఘం (TMKEWA).