న్యూఢిల్లీ, ఆగస్టు 3, (వాయిస్ టుడే): ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి కలిశారు. కాసేపు వీరు కలిసి సరదాగా ముచ్చటించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత తొలిసారి ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగానే బండి సంజయ్ పార్టీకి అందించిన సేవలను గుర్తు చేశారు. బండి సంజయ్ వల్లే పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోందని.. అలాగే చాలా మంది బీజేపీలోకి వచ్చేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. ఈక్రమంలోనే బండిని అభినందించారు.
రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పని చేయాలని సూచించారు. అందర్నీ కలుపుకుని ముందుకు సాగుతూ.. ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ సందర్భంగానే బండి సంజయ్ కుటుంబ సభ్యులంతా ప్రధాని మోదీతో కలిసి ఫొటోలు దిగారు. అప్పుడు ఏం చదువుతున్నారు, ఎలా ఉన్నారంటూ బండి కుమారులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే విషయాన్ని బండి సంజయ్ ట్విటర్ వేదికగా తెలిపారు. ప్రధాని మోదీతో తన కుటుంబ సభ్యులు కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఈరోజు తాను జీవితాంతం గుర్తుంచుకోవాల్సి రోజు అంటూ రాసుకొచ్చారు. తన కుటుంబ సభ్యుల కోసం ప్రధాని కేటాయించిన ప్రతీ సెకను తనకు చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. ఇదే తనకు అసలైన బహుమతి అంటూ వివరించారు.