స్విచ్ ఆన్ చేసి.. నీటి విడుదల
నిర్మల్ వాసుల కల శ్రీ కారం
అదిలాబాద్, అక్టోబరు: 15 సంవత్సరాల నిర్మల్‌వాసుల కల సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సాకారమైందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దిలావర్‌పూర్ మండలంలోని గుండంపెల్లి వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ నంబర్ -27 ( శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకం)ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. స్థానిక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ఎత్తిపోతల పథకానికి స్విచ్ ఆన్ చేసి కాలువలకు నీటిని విడుదల చేసి రైతులకు అంకితం ఇచ్చారు. తర్వాత దిలావర్పూర్ శివారులోని డెలివరీ సిస్టర్ ను పరిశీలించి పూజలు చేశారు. అనంతరం సోన్ మండలం మాదాపూర్ వద్ద రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతి ఎకరానికీ సాగు నీరందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూ. 714 కోట్ల వ్యయంతో 27 ప్యాకేజ్ ద్వారా నిర్మల్ నియోజకవర్గంలోని 99 గ్రామాల్లోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన లక్ష్మీ నర్సింహాస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం సంతోషకరమని వెల్లడించారు. పంప్ హౌస్ వల్ల రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి ఎత్తిపోతల పథకాన్ని రూ.714 కోట్లతో నిర్మించారు.
ఈ పథకం ద్వారా నిర్మల్ నియోజకవర్గంలోని దిలావర్‌పూర్, నర్సాపూర్ (జి), కుంటాల, సారంగాపూర్, నిర్మల్, లక్ష్మణచాంద, మామడ, సోన్ మండలాల్లోని 99 గ్రామాల పరిధిలో గల చెరువులు, కుంటలకు నీరందించే అవకాశం కలిగింది. 20 ఏండ్లుగా ఒకే పంటకు పరిమితమైన భూముల్లో ఇక మూడు పంటలు రానుండగా, అన్నదాతల సంతోషానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, నిర్మల్ నియోజకవర్గ రైతులకు సాగు నీరందేలా చేసిన సీఎం కేసీఆర్‌కు రైతన్నలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్యాకేజీ 27 పనులను మూడు యూనిట్లుగా విభజించి పనులను పూర్తి చేశారు. మొదటి యూనిట్ కింద 32 వేల ఆయకట్టును నిర్ధేశించారు. ఇందులో భాగంగా దిలావర్‌పూర్ గ్రామ శివారులో సిస్టర్న్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీని ద్వారా లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్‌లోకి సాగు నీటిని ఎత్తి పోయనున్నారు. యూనిట్-1 కింద ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో గుండంపెల్లి వద్ద ఇప్పటికే పంప్‌హౌస్ నిర్మాణం పూర్తయింది.ఇక్కడ 6.70 కిలోమీటర్ల పొడువుతో అప్రోచ్ చానల్‌ను నిర్మించారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ పొడువు 29.50 కిలో మీటర్లు కాగా, ఈ కాలువ ద్వారా నీటి సరఫరా సామర్థ్యం 140 క్యూసెక్కులు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాగే రైట్ మెయిన్ కెనాల్ పొడువు 13.50 కిలోమీటర్లు కాగా, నీటి సరఫరా సామర్థ్యం 100 క్యూసెక్కులుగా ఉంది. గుండంపల్లి లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ప్రారంభంకి వచ్చిన మంత్రి కేటీఆర్ ను ఆశా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో ఆశా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆశా వర్కర్లు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఆశా కార్యకర్త సొమ్మసిల్లి పడిపోవడంతో పోలీసుల తీరిపై ఆశా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమని వెల్లడించారు. చివరికి ప్యాకేజీ 27 కాళేశ్వరం పనులు ప్రారంభించిన తర్వాత మంత్రి కేటీఆర్ కు ఆశా కార్యకర్తలు వినిత పత్రం అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.