శాంతి, ప్రేమ మార్గాలను పాటిస్తూ ప్రశాంతంగా జీవనం సాగించాలి
-క్రైస్తవ ప్రార్థన స్థలాల అభివృద్ధికి అవసరమైన చర్యలు
-మంథని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఐటీ, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు
-క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
మంథని
మానవాళి క్రైస్తు బోధనలైన శాంతి, ప్రేమ మార్గాలను పాటిస్తూ ప్రశాంతంగా జీవనం సాగించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.
సోమవారం మంథని పట్టణంలోని బేతేలు గాస్పెల్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ క్రైస్తు జన్మదినం సందర్భంగా జిల్లాలో ఉన్న క్రైస్తవులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు దీవెనలతో, క్రైస్తవుల సహకారంతో తనను మంథని ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించారని, ఎన్నికల సమయంలో అనేకమంది పాస్టర్లు తనకోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారని,రాష్ట్రంలో సైతం ప్రజా ప్రభుత్వం వచ్చిందని, క్రైస్తవుల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ప్రభుత్వం పని చేస్తుందని, క్రైస్తవుల ప్రార్ధన స్థలాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఆ ప్రభువు ఆశీస్సులతో విజయవంతంగా ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని అన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే శక్తి ఆ ప్రభువు మాకు అందించేలా ప్రార్థించాలని మంత్రి పాస్టర్లను కోరారు. రాబోయే ఐదు సంవత్సరాల పాటు నాయకుడిగా కాకుండా సేవకుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని మంత్రి అన్నారు. మంథని ప్రాంతంలో సైతం ఐటీ, ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా ప్రణాళికాబద్ధంగా తన శాయశక్తుల కృషి చేస్తానని మంత్రి అన్నారు.
అనంతరం క్రిస్మస్ వేడుకలలో భాగంగా మంత్రి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పేద క్రైస్తవులకు ప్రభుత్వం తరపున అందించే క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను మంత్రి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్లు, సంఘం పెద్దలు, మహిళలు, క్రిస్టియన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.