3 రకాల మెంబర్ షిప్ తో జనసేన

- Advertisement -

3 రకాల మెంబర్ షిప్ తో జనసేన
విజయవాడ, ఫిబ్రవరి 17, (వాయిస్ టుడే)

Janasena with 3 types of membership
జనసేన పార్టీ తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, కార్యకర్తల భాగస్వామ్యాన్ని క్రమబద్ధీకరించేందుకు సరికొత్త సభ్యత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో పార్టీలో మూడు రకాల సభ్యత్వ వర్గాలను నిర్ణయించింది.   జనసేన పార్టీ తన శ్రేణులను మూడు విభాగాలుగా విభజించింది. మొదటి  వారిని  ఉద్యమి గా పిలుస్తారు. వీరు పార్టీపై నమ్మకం, అభిమానంతో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వారు. రెండవ కేటగిరీకి చెందిన వారిని సాధక్ అని పిలుస్తారు.  వీరు కేవలం సభ్యులుగానే కాకుండా, పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేస్తూ, పార్టీ ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ఇక మూడవ కేటగిరీలోకి ప్రధాతలు వస్తారు. వీరు  పార్టీకి వివిధ రూపాల్లో ఆర్థికంగా లేదా మేధోపరంగా అండగా నిలుస్తూ, నాయకత్వ బాధ్యతలు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారు.సభ్యత్వ నమోదు ప్రక్రియను పారదర్శకంగా మరియు సులభంగా నిర్వహించేందుకు జనసేన పార్టీ డిజిటల్ పద్ధతులను అవలంబిస్తోంది. ప్రతి సభ్యుని వివరాలను ఆన్‌లైన్ డేటాబేస్‌లో నిక్షిప్తం చేయడం ద్వారా, భవిష్యత్తులో వారికి ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలను అందించాలని పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా యువతను ఈ  ఉద్యమి-సాధక్-ప్రధాత ‘ విధానం వైపు ఆకర్షించడం ద్వారా పార్టీలో జవాబుదారీతనం పెరుగుతుందని నాయకత్వం ఆశిస్తోంది.ఏపీలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ప్రతి గ్రామం, వార్డులో జనసేన జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతోంది. సాధారణ సభ్యుల నుండి నాయకుల వరకు వారి పనితీరు , అంకితభావాన్ని బట్టి ఈ వర్గీకరణలో గుర్తింపు లభిస్తుంది. ఈ నూతన విధానం ద్వారా పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు, క్రమశిక్షణతో కూడిన రాజకీయ వ్యవస్థను నిర్మించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular