మాటల యుద్ధం
హైదరాబాద్, మార్చి 27,
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేళ నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ మాతృసంస్థ బీజేపీ గూటికి చేరడం ఖాయమంటున్నారు కేటీఆర్. రాహుల్ గాంధీ మోదీని విమర్శిస్తుంటే.. రేవంత్ మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతున్నారన్నారు. సీఎం రేవంత్ వస్తానంటే మల్కాజ్‌గిరిలో ఇప్పటికైనా పోటీకి సిద్ధమన్నారు కేటీఆర్. ఈ ఎన్నికలు పదేళ్ల నిజం.. పదేళ్ల విషం.. వంద రోజుల అబద్ధానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని కేటీఆర్ కామెంట్ చేశారు. కొంత్త మంది బీఆర్ఎస్‌పై అనవసరంగా విషం చిమ్ముతున్నారు. ఓటుతోనే మొరిగే వారికి సమాధానం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నానని అనుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఉందా అని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ బడాబాబుల 14500 కోట్ల రుణాలు మాఫీ చేసిందన్నారు. 11650 కోట్ల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఆ పార్టీ అకౌంట్లలో ఉన్నాయని విమర్శించారు.ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎంపీగా గెలిచిన తరువాతే రంజిత్ రెడ్డి అంటే ప్రపంచానికి తెలిసిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేయను.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని రంజిత్ రెడ్డి తమతో చెప్పారన్నారు. కేవలం ఆస్తులు, అధికారం కోసమే బీఆర్ఎస్‌ను వీడారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్ట్ జరిగిన రోజే నవ్వుకుంటూ కాంగ్రెస్‌లో చేరారు అని విమర్శించారు. గతంలో పార్టీని వీడిన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయారని గుర్తు చేశారు. పార్టీల కన్నా వ్యక్తులు గొప్ప కాదన్నారు. అదే నిజమైతే దేశంలో పార్టీలు ఉండవని కేవలం స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అయోమయం నెలకొందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవడం అసాధ్యమని జోస్యం చెప్పారు. తెలంగాణ లోక్ సభ ఎన్నిలకల్లో భాగంగా ఏప్రిల్ 13న చేవేళ్లలో కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని ప్రకటించారు కేటీఆర్.
మాటల యుద్ధం
- Advertisement -
- Advertisement -