కాపు ఓట్లు గుంపగుత్తేనా
కాకినాడ, మే 9
ఏపీలో కాపుల రాజకీయ ఐక్యతకు వైసీపీ కృషి చేసిందని కాపు ఉపకులాలు బలంగా భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కొనే క్రమంలో చేసిన విమర్శలు కాపుల ఐక్యతకు పరోక్షంగా ఉపయోగపడిందని ఆ వర్గాలు భావిస్తున్నాయి.త్వరలో జరిగే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఈసారి ఎక్కువ భాగం జనసేనకు అనుకూలంగా పడతాయని ఆ వర్గం నేతలు భావిస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణాలు రెండు మూడు ఉన్నాయి.పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా వైఎస్సార్సీపీ టార్గెట్ చేయడం కాపులను ఆ పార్టీకి దూరం చేసింది. కాపులు జనసేన, తెలుగుదేశం వైపు ఉన్నా వైఎస్సార్సీపీని కూడా గత ఎన్నికల్లో చాలా మంది కాపులు వదల్లేదు. ఆ పార్టీలోని ముఖ్య నాయకుల్లో జక్కంపూడి రాజా, ఆళ్ల నాని, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, వంగా గీత, పెండెం దొరబాబు, కురసాల కన్నబాబు.. వీళ్లంతా కాపు సామాజిక వర్గానిిక చెందిన నాయకులే.అయితే పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడానికి అదే కులం నాయకుల్ని వైసీపీ ప్రయోగించడం వికటించిందని కాపు వర్గం భావిస్తోంది. వీరిలో గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, పేర్ని నాని – ఈ ముగ్గుర్నీ ఇప్పుడు కాపు కులం అంతా వ్యతిరేకించే పరిస్థితి కల్పించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.కాపులు ఏ పార్టీకి ఓటేసినా, పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ మీద ఆ సామాజిక వర్గంలో ఆదరణ భావం ఉంటుంది. పవన్ కళ్యాణ్ సమర్థత మీద, పవన్ కళ్యాణ్ కార్యదక్షత మీద, పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలుస్తాడా లేడా అన్న అంశం మీద వారికి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు.పవన్ కళ్యాణ్ సరైన వ్యూహంతో వెళ్లనప్పుడు, రాజకీయంగా పొరబాట్లు చేసినపుడు తీవ్రంగా విమర్శించినా కాపులందరికీ పవన్ కళ్యాణ్ మీద సాప్ట్ కార్నర్ ఉంటుందని చెబుతారు. సొంత కులం వాడు కావడంతో పాటు వ్యక్తిగతంగా మంచివాడు, అవినీతి ముద్ర లేకపోవడం, తాను సంపాదించింది కూడా నలుగురికీ పెడతాడు అనే అభిప్రాయం పవన్ కళ్యాణ్ మీద కాపుల్లో బలంగా ఉంది.ఈ తరహా అభిప్రాయం కాపులతో పాటు ఇతర కులాల్లో పవన్ కి ఓటు వేయని వారు కూడా అతని నిజాయితీని సందేహించరు. అతని అభిమానుల సంఖ్య తగ్గక పోవడానికి అది కూడా ఒక కారణం. రాజకీయంగా పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడిగా కనిపించకపోయినా ఒక వ్యక్తిగా పవన్ మీద కాస్త ఆదరణ భావం కాపుల్లో కచ్చితంగా ఉంది.గత ఐదేళ్లలో పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా భయంకరంగా తిట్టించడంలో వైయస్సార్సీపీ ముందుంది. గతంలో టీడీపీ నాయకులు పొత్తు వీడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్‌ని తిట్టినా వైఎస్సార్సీపీ వ్యక్తిగతం టార్గెట్ చేసింది. ముగ్గురు రాష్ట్ర మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబులకు వేరే పనేమీ లేనట్టుగా పవన్ కళ్యాణ్ ని తిట్టడమే పూర్తి స్థాయి పనిగా పెట్టుకోవడం అనేది కాపుల్లో పవన్ మీద సాఫ్ట్ కార్నర్ పెంచింది.ఒక దశలో పేర్ని నాని తాను జగన్ కు పాలేరును అని చెప్పుకోవడం కూడా కాపులకు రుచించలేదు. దీంతో వైఎస్సార్సీపీలో ఉన్న కాపులను పాలేరు కాపులంటూ విమర్శించడం మొదలుపెట్టారు. హార్డ్ కోర్ కాపు కుల అభిమానం ఉన్నవారు. పవన్ మీద పెద్దగా ప్రేమ లేకుండా నూట్రల్ భావంతో ఉన్న సాధారణ కాపుల్లో కూడా మంత్రుల తిట్లతో పవన్ పట్ల సానుభూతి పెరిగేలా చేశాయివల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారు చంద్రబాబును వ్యక్తిగతంగా తిట్టడం కమ్మవారికి ఎలా కోపాన్ని తెప్పించిందో, దాదాపు అదే స్థితి కాపుల్లో రావడానికి వైయస్సార్సీపీ వ్యూహం కారణం అయింది. ఇది అక్కడితో ఆగలేదు.ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మరో ఇద్దరు కాపు నాయకులు చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం – ఎన్నికల ముందు లేఖలతో అంత హడావుడి చేసి చివరగా వైయస్సార్సీపీ వైపు చేరడం కూడా పవన్ మీద కుట్రలు జరుగుతున్నాయనే భావన పెంచింది.ఈ మొత్తం వ్యవహారం కాపులే లక్ష్యంగా జగన్ చేసిన వ్యూహంగా గుర్తించారు. దీంతో వారిలో ఏకీకరణకు ఈ అంశాలు కూడా కారణం అయ్యాయి. తుని రైలు ఘటన దగ్గర నుంచీ ముద్రగడకీ వైయస్సార్సీపీకి మధ్య ఉన్న బంధంపై పలువురు ముఖ్య కాపు నేతలకు అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇది బయట పడి పోయింది. ఈ మొత్తం వ్యవహారం అంతా తెలిసిన కొందరు తెలివైన వైఎస్సార్సీపీ కాపు నాయకులు మాత్రం ఈ విషయంలో ఎక్కడా పార్టీ లైన్లోకి వెళ్లకుండా అటు పార్టీనీ, ఇటు తమ కులం వారినీ నొప్పించక తానొవ్వక రీతిలో తప్పించుకున్నారు.