కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష
దీక్షాదివస్ సభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
KCR’s leadership is the ultimate safeguard for Telangana: MP Vaddiraju Ravichandra

ఖమ్మం: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనతో ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన కేసీఆర్ను తెలంగాణ జాతిపితగా ఆయన అభివర్ణించారు.
దీక్షాదివస్ సందర్భంగా ఖమ్మంలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన సభకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్ రావు, తాతా మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు పాలాభిషేకం చేశారు. అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
సభలో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు కలిసి ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో ఆ ప్రయత్నాలను బీఆర్ఎస్ శ్రేణులు సమర్థంగా ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును బీఆర్ఎస్ వ్యతిరేకించి ముస్లిం సమాజానికి అండగా నిలిచిందని గుర్తుచేశారు. జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలిపిందని, బీజేపీకి బీ టీంగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు.
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుల అమలుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఎంపీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పెంపు అంశం చాలా కాలంగా పెండింగ్లో ఉందని పేర్కొన్నారు. మహిళలు, బీసీలకు చట్టసభల్లో 33 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ 2014 జూన్ 14న తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన అసాధ్యమని భావించిన పరిస్థితుల్లోనూ తన దీక్షాదక్షతతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కృషి చేశారని రవిచంద్ర కొనియాడారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ కీర్తి ప్రతిష్ఠలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.




