0.1 C
New York
Wednesday, February 21, 2024

వ్యూహాలు మారుస్తున్న గులాబీ బాస్

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 27, (వాయిస్ టుడే): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. తెలంగాణలో ఆ పార్టీ ఊపునకు ఓ కారణమైంది. కొద్ది రోజుల్లోనే చేరికలు పెరిగి ‘హస్తం’ పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. కర్ణాటక ఫలితాల వరకూ బీజేపీయే తమ టార్గెట్‌ అన్న బీఆర్ఎస్‌‌కు ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా మారింది. సీఎం మొదలు మంత్రులు, గులాబీ నేతల వరకు అందరికీ ఆ పార్టీనే టార్గెట్‌గా మారింది. కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీస్ ప్రకటన తర్వాత ఆ గుబులు మరింతగా పెరిగింది. ఇటీవల స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా ‘మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే’ అని స్పష్టం చేశారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో విచ్ఛిన్న రాజకీయాలు చేస్తున్నదని, ప్రధాని మోడీ అసమర్థుడని, ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేస్తూ దేశ సంపదను అదానీ లాంటి సన్నిహితులకు కట్టబెడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వైఖరిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత మార్పు వచ్చింది. మోడీ ప్లస్ అదానీ కలిసి మోదానీ అని కేటీఆర్ వ్యాఖ్యలు చేసినా ఇప్పుడు బీజేపీ పట్ల ‘లైట్ తీసుకో’ అనే పాలసీ అమలవుతున్నది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ ప్రభావం చూపే రాజకీయ ప్రత్యర్థి అనే అభిప్రాయం బీఆర్ఎస్ నేతల్లోనూ లేదు. ఆ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నా విజయావకాశాలను ప్రభావితం చేసేంత ప్రమాదమేమీ లేదనే భావనతో నేతలు ఉన్నారు.సోనియా ప్రకటించిన సిక్స్ గ్యారంటీస్ ప్రజల్లో విస్తృతంగా వెళ్లాయని, కొత్త కాన్ఫిడెన్సు కలిగించిందని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. ప్రజల్లో జనరల్‌గానే ఓపెన్ టాక్ జరుగుతున్నదని, ఇది పబ్లిక్ మూడ్‌గా ఎస్టాబ్లిష్ అయిందని, తమ పార్టీ గెలుపునకు ఇవి తారకమంత్రాలుగా పని చేస్తాయన్నది వారి విశ్వాసం. రాహుల్‌గాంధీ ఇటీవల మూడు రోజుల పాటు రాష్ట్రంలో నిర్వహించిన బస్సు యాత్రలోనూ ఈ గ్యారంటీస్‌ గురించే ప్రజలకు వివరించారు. ఇవి ఎంత లోతుగా ప్రజల్లోకి వెళ్తే అంత ఫలితం వస్తుందనేది కాంగ్రెస్ అభిప్రాయం. దీనికి బలం చేకూర్చే విధంగా కర్ణాటకలో ఇచ్చిన ఫైవ్ గ్యారంటీస్ అమలును జనానికి అర్థం చేయిస్తున్నారుకాంగ్రెస్‌కు కౌంటర్ ఇవ్వకపోతే గ్రౌండ్‌లో పార్టీ దెబ్బతింటుందన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ కౌంటర్ స్ట్రాటెజీ అమలు చేస్తున్నది. ‘వారెంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీలకు విలువేముంది.. 50 ఏండ్లు రాష్ట్రాన్ని పాలించిన ఆ పార్టీ చిత్తశుద్ధి ప్రజలకు తెలియదా.. ఇంతకాలం ఇలాంటి హామీలు ఎందుకు అమలు చేయలేదు.. మూడు గంటల కరెంటు చాలు అన్న వాళ్లను గెలిపిస్తే రాష్ట్ర ప్రగతి గాడి తప్పుతుంది.. పదేళ్ల పాలనలో కేసీఆర్ మార్గదర్శకత్వంలో అన్ని సెక్షన్ల ప్రజలకు సంక్షేమం అందుతున్నది’.. అనే అంశాలను గులాబీ నేతలు ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలు అమలు కావు అనడానికి ఇప్పుడు ఆ రాష్ట్రంలో విద్యుత్ కోతలే నిదర్శనమంటూ తాజా పరిస్థితిని స్టేట్‌మెంట్లు, వీడియో రూపంలో సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నది.పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వివిధ కారణాలతో నెలకొన్న యాంటీ ఇన్‌కంబెన్సీ ఏం ముప్పు తెస్తుందోనని బీఆర్ఎస్ గుబులు పడుతున్నది. అనివార్యంగా అది కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుందేమోననే అనుమానిస్తున్నది. ఏ పరిస్థితినీ చేజార్చుకోవద్దని భావిస్తున్నది. సొంత పార్టీ బలపడాలంటే ప్రత్యర్థి పార్టీని బలహీనం చేసే పాలసీని ఎంచుకున్నది. బీజేపీకి ఎలాగూ రాష్ట్రంలో రాజకీయంగా పోటీ ఇచ్చేంత సామర్ధ్యం లేదన్న అంచనాతో కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేయొద్దని బీఆర్ఎస్ భావిస్తున్నది. గతంలో వంద జాకీలు పెట్టినా లేవదు.. ముసలి పార్టు.. అది కాంగ్రెస్ కాదు.. స్కాంగ్రెస్.. ఇలా అనేక కామెంట్లతో పాటు రాష్ట్ర పార్టీ హెడ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నది. ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన దొంగ.. ఇప్పుడు టికెట్లను అమ్ముకునేవాడు రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్నే అమ్మేస్తాడు.. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి చివరకు బీజేపీలోకే వెళ్తాడు.. ఇలాంటి కామెంట్లనూ గులాబీ నేతలు ఎంచుకున్నారు. కాంగ్రెస్‌ను ఎంతగా బద్నాం చేయగలిగితే ప్రత్యర్థిగా దాని స్థానాన్ని అంతగా వీక్ చేయొచ్చన్నది గులాబీ పార్టీ వ్యూహం.అధికారంలోకి రాకుండా కాంగ్రెస్‌ను నిలువరించాలన్నది బీఆర్ఎస్ వ్యూహమైతే.. మూడోసారి పవర్‌లోకి రాకుండా కల్వకుంట్ల ఫ్యామిలీని ఇంటికి సాగనంపాలన్నది హస్తం పార్టీ ఆలోచన. ఎన్నికల సర్వే (ఒపీనియన్ పోల్) అంచనా ఫలితాల్లోనూ ఇవి పోటీ పడుతున్నాయి. ప్రజల మైండ్‌ను‌ సెట్ చేయడంలో ఈ ఫలితాలు ప్రభావం చూపుతాయన్న ఉద్దేశంతో రకరకాల ప్రైవేటు సంస్థలను లోపాయకారీగా వాడుకుంటున్నాయి. ఈ రెండు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాల్లో ఎవరిది పైచేయి అవుతుంది.. మూడో పార్టీగా ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ ఏ మేరకు ఓట్లు చీలుస్తుంది.. అది ఏ పార్టీకి చేటు తెస్తుంది.. ఏ పార్టీకి లబ్ధి చేకూరుస్తుంది.. అన్నది రానున్న కాలంలో తేలనున్నది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!