- Advertisement -
రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ చంద్ర పునేఠా
Anil Chandra Punetha has assumed charge as the State Vigilance Commissioner
అమరావతి, అక్టోబర్ 30 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పునేఠా (రిటైర్డ్ ఐఏఎస్) ను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిషనర్‌గా నియమించింది. అంతకు ముందు పునేఠా 2019 వరకూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేశారు. సీఎస్‌గా బాధ్యతలు చేపట్టక ముందు పునేఠా సీసీఎల్ఏ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. 1984 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన పునేఠా కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్‌గా తన వృత్తిని ప్రారంభించి ఉమ్మడి రాష్ట్రం లో పలు కీలక శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ పోస్టు గతకొంత కాలంగా ఖాళీగా ఉండడంతో రెండు రోజుల క్రితం పునేఠాను కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం జారీ చేశారు. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ హోదాలో అనిల్‌చంద్ర పునేఠా రెండేళ్ల పాటు విధులు నిర్వహించనున్నారు. అంతకు ముందు పునేఠా ఉత్తరాఖండ్ రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా మూడేళ్లపాటు విధులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ శాఖలో సిసియల్ఎ కమిషనర్ గా పనిచేసిన కాలంలో పలు సంస్కరణ చేపట్టి కేంద్ర ప్రభుత్వం నుండి అనేక జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా పనిచేసిన సమయం లోను అనిల్ చంద్ర పునేట ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రశంసలు పొందారు. ఇప్పటి వరకూ రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని విజిలెన్స్ కేసులను పరిష్కరించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ చంద్ర పునేఠాను పలువురు అధికారులు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు అభినందించారు.
- Advertisement -