బాల్యవివాహాల రహితంగా అన్నమయ్య జిల్లాను తీర్చిదిద్దాలి
Annamaiya district should be made child marriage free
రాయచోటి జనవరి 31:
అన్నమయ్య జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి మరియు జిల్లా ప్రత్యేక అధికారి సూర్యకుమారి ఐసిడిఎస్ అధికారులు, సూపర్వైజర్లను ఆదేశించారు.శుక్ర వారం రాయచోటి కలెక్టరేట్ నందలి పిజిఆర్ఎస్ హాలులో…. ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ శాఖలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి మరియు జిల్లా ప్రత్యేక అధికారి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాల రైతు జిల్లాగా తీర్చిదిద్దేందుకు స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. జిల్లాలో అంగన్వాడి సేవలను మరింత పటిష్టవంతంగా నిర్వహించాలని చెప్పారు. కిషోర్ వికాసం కార్యక్రమానికి సంబంధించి అంగన్వాడి, పాఠశాలలు, కాలేజీలలో సఖి గ్రూపులను మరియు యువ గ్రూపులను ఏర్పాటు చేసి వారంలో ఒకరోజు గ్రూపులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. బాలికలు వారి సమస్యలను వారే పరిష్కరించుకునే విధంగా మహిళా సంరక్షణ కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రతి గ్రూపు కి ఒక పీర్ గ్రూప్ లీడర్ ని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అనంతరం మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలను, అంగన్వాడి కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా బాత్రూములు, నీళ్ల సదుపాయం, విద్యుత్తు, ఇతర సదుపాయాలు సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. వాష్ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు పరచాలని కోరారు. సమావేశంలో కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బాల్య వివాహాలను కట్టడి చేసేందుకు జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ప్రత్యేక అధికారికి వివరించారు. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఐసిడిఎస్ శాఖ అధికారులు సూపర్వైజర్లకు సూచించారు. ఇందులో కొన్ని సమాజ పరమైన సమస్యలు ఉన్నప్పటికీ సామాజిక బాధ్యతలో ఉన్నటువంటి సర్పంచ్, గ్రామ పెద్దలు, బాల్య వివాహ నిషేధ కమిటీల ద్వారా అవగాహన కల్పిస్తూ బాల్య వివాహాల వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం వివిధ అంశాలలో తగు సూచనలు జారీ చేశారు.అంతకు ముందుగా సమావేశం ప్రారంభంలోజిల్లాకు మొదటిసారిగా విచ్చేసిన జిల్లా ప్రత్యేక అధికారి సూర్యకుమారికి జిల్లా కలెక్టర్ స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సమావేశంలో మదనపల్లె, రాజంపేట సబ్ కలెక్టర్లు మేఘస్వరూప్, నైదియాదేవి, ఐసిడిఎస్ కర్నూలు రీజనల్ జాయింట్ డైరెక్టర్, జిల్లా ఐసిడిఎస్ అధికారిణి, జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారి, ఐసిడిఎస్ సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.