కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి: కేటీఆర్..
Be stubborn like Congress: KTR..
హైదరాబాద్:
రైతు రుణమాఫీ అంశంలో బీఆర్ఎస్ నేతల ఆరోపణలు ఆగడం లేదు. పూర్తి రుణ మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కానీ రుణమాఫీ ఓ బోగస్ అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఇప్పటికే ఈ పథకంపై అనేక విమర్శలు చేశారు. ఇంకా రైతులకు పూర్తిగా మాఫీ చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల ఖాతాల్లో నగదు వేసినట్లు గొప్పలు చెప్పుకుంటుందని మండిపడుతున్నారు. తాజాగా రుణమాఫీ అంశంపై కేటీఆర్ మరోసారి స్పందించారు.
సమాధానం చెప్పే నాథుడే లేడు..!
రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అన్నివిధాలా అర్హత ఉన్నా ఎందుకు మాఫీ కాలేదో చెప్పేవారు లేరంటూ ఆయన ఆగ్రహించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ” కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు పంట సీజన్లు గడిచినా రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలేదు. జూన్‌లో వేయాల్సిన రైతు భరోసా ఆగస్టు దాటుతున్నా లబ్ధిదారుల ఖాతాల్లో వెయ్యలేదు. కౌలు రైతులకు ఇస్తానన్న రూ.15వేలు ఇంకా ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు రూ.12వేల హామీ ఇంకా అమలే చెయ్యలేదు. కాంగ్రెస్ అంటేనే మొండి చెయ్యి చూపించే పార్టీ అని మరోసారి తేలిపోయింది” అని అన్నారు.