0.1 C
New York
Wednesday, February 21, 2024

ఎర్రకోటపై మువ్వన్నెల అందాలు

- Advertisement -
  • రానున్న ఐదేళ్లలో ప్రపంచ దేశాల్లో అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్
  • దేశాన్ని నాశనం చేసిన మూడు చెడుగులను అంతం చేస్తా
  • పేదరికం తగ్గితే, మధ్య తరగతి ప్రజల బలం పెరుగుతుంది
  • 13.5 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటకు వచ్చారు
  • రెండు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా చేయాలనేది తన కల
  • దేశంలో యువతకు మెరుగైన భవితను కల్పిస్తామని హామీ
  • మణిపూర్‌లో సంపూర్ణ శాంతి సంకల్పంతో చర్చలు
  • వారసత్వ రాజకీయాలు ఈ దేశాన్ని సర్వనాశనం చేశాయన్నారు.
  • ఎర్రకోటలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ
beauty-of-muvvannela-on-red-fort
Beauty of Muvvannela on Red Fort

దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని  దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కోట బురుజుపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి మాట్లాడుతూ.. 140 కోట్ల భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పారు. బాపూజీ చూపిన అహింసా మార్గంలో స్వాతంత్య్రం సాధించామన్నారు. స్వాతంత్య్ర సమరంలో అసువులుబాసిన మహానుభావులకు నమస్సుమాంజలులు పలుకుతున్నాని తెలిపారు.ఈ ఏడాది అరవిందుడు, దయానంద సరస్వతి 150వ జయంతి జరుపుకుంటున్నామని చెప్పారు. రాణి దుర్గావతి, మీరాబాయిని స్మరించుకోవాల్సిన తరుణమిదన్నారు. మణిపూర్‌లో జరిగిన హింత అత్యంత బాధాకరమైనదని తెలిపారు. కొద్దిరోజులుగా అక్కడ శాంతి నెలకొంటున్నదని, మణిపూర్‌కు యావజ్జాతి అండగా నిలుస్తున్నదని చెప్పారు. మణిపూర్‌లో నూరు శాతం శాంతి సాధించాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. సంపూర్ణ శాంతి సంకల్పంతో చర్చలు సాగుతున్నాయని వెల్లడించారు.

పేదరికం తగ్గితే, మధ్య తరగతి ప్రజల బలం పెరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రానున్న ఐదేళ్లలో భారత దేశం ప్రపంచ దేశాల్లో అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని, ఇది మోదీ ఇచ్చే గ్యారంటీ అని తెలిపారు. 13.5 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటకు వచ్చారని, వారంతా మధ్య తరగతికి బలంగా మారారని చెప్పారు. ఆ మూడింటి అంతానికి శపథం

దేశాన్ని నాశనం చేసిన మూడు చెడుగులను అంతం చేస్తానని మోదీ శపథం చేశారు. అవినీతి, వారసత్వ రాజకీయాలు, బుజ్జగింపులను అంతం చేస్తానని చెప్పారు. అవినీతిపైన పోరాడుతూనే ఉండటానికి తాను నిబద్ధతతో జీవితాంతం కట్టుబడి ఉన్నానని చెప్పారు. వారసత్వ రాజకీయాలు ఈ దేశాన్ని సర్వనాశనం చేశాయన్నారు. ప్రజల హక్కులను వారసత్వ రాజకీయాలు తొలగించాయన్నారు. బుజ్జగింపులు జాతీయ స్వభావంపై ఓ కళంకంగా మారిపోయాయని తెలిపారు. ఈ మూడు చెడుగులపైనా మనం సంపూర్ణ బలంతో పోరాడాలని పిలుపునిచ్చారు. నేడు మనకు ప్రజల సంఖ్యాబలం ఉందని, అదేవిధంగా ప్రజాస్వామ్యం, వైవిద్ధ్యం ఉన్నాయని, దేశం యొక్క కలలను సాకారం చేసే శక్తి, సామర్థ్యాలు ఈ మూడింటికి ఉన్నాయని చెప్పారు.

మహిళలు లక్షాధికారులుగా..

మహిళా స్వయం సహాయక బృందాల కృషిని మోదీ ప్రశంసించారు. రెండు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా చేయాలనేది తన కల అని చెప్పారు. నేడు మహిళా స్వయం సహాయక బృందాల్లో 10 కోట్ల మంది మహిళలు ఉన్నారని తెలిపారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధి జరిగితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. పౌర విమానయాన రంగంలో మహిళా పైలట్లు ఉన్నారని, మహిళలు శాస్త్రవేత్తలు అవుతున్నారని చెప్పడం గర్వంగా ఉందని చెప్పారు. చంద్రయాన్ కార్యక్రమానికి మహిళా శాస్త్రవేత్తలు నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యాన్ని జీ20 దేశాలు గుర్తించాయన్నారు.

యువతకు మెరుగైన భవిత

దేశంలో యువతకు మెరుగైన భవితను కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో అవకాశాలకు కొరత లేదన్నారు. అంతులేని అవకాశాలను అందించే సమర్థత భారత దేశానికి ఉందన్నారు. యువత శక్తి, సామర్థ్యాలపై తనకు నమ్మకం ఉందన్నారు. యువతకు సమర్థత ఉందని, మన విధానాలు, కార్యక్రమాలు వారిని బలోపేతం చేసేవేనని తెలిపారు. మన యువత ప్రపంచంలో మొదటి మూడు స్టార్టప్ ఇకోసిస్టమ్స్‌లో ఒకదానిగా భారత దేశాన్ని తీసుకెళ్లారని తెలిపారు.

మన దేశ సైనిక దళాలు నూతన జవసత్త్వాలతో, యుద్ధ సన్నద్ధతతో ఉండేలా నిరంతరం సంస్కరణలు జరుగుతున్నాయని చెప్పారు. సురక్షితంగా ఉన్నామనే భావన నేడు దేశానికి ఉందన్నారు. శాంతి, భద్రత ఉన్నపుడు మనం అభివృద్ధిపై దృష్టి పెట్టగలుగుతామన్నారు.

beauty-of-muvvannela-on-red-fort
Beauty of Muvvannela on Red Fort

ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోసమే..

ప్రభుత్వానికి ఉన్న ప్రతి క్షణం, ప్రతి రూపాయి దేశ ప్రజల సంక్షేమం కోసమే ఖర్చవుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, ప్రజలు ఐకమత్యంగా ఉన్నందువల్ల మనం బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకున్నామని, లీకేజీలను అరికట్టగలిగామని చెప్పారు. సంక్షేమ పథకాలను పొందుతున్న 10 కోట్ల మంది బూటకపు లబ్ధిదారులను తొలగించినట్లు తెలిపారు. అక్రమాస్తుల జప్తు 20 రెట్లు పెరిగిందన్నారు.

అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన రంగంలో భారత దేశ సామర్థ్యం వేగంగా పెరుగుతోందన్నారు. డీప్ సీ మిషన్, రైల్వేల ఆధునికీకరణ, వందే భారత్ రైలు, బుల్లెట్ రైలు… ఇలాంటివాటి కోసం మనం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. నానో యూరియా కోసం కృషి చేస్తున్నామని, ఆర్గానిక్ వ్యవసాయంపై కూడా దృష్టి పెట్టామని చెప్పారు. తన ప్రభుత్వం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు తన ప్రభుత్వ హయాంలోనే ప్రారంభోత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు.

దేశం నలుమూలల నుంచి ప్రత్యేక అతిథులు

స్వాతంత్ర్య దినోత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేయడం కోసం వివిధ రంగాల్లో పని చేస్తున్నవారిని ప్రత్యేక అతిథులుగా ప్రభుత్వం ఆహ్వానించింది. ఎర్ర కోట వద్ద జరిగిన ఈ ఉత్సవాల్లో దేశంలోని నలుమూలల నుంచి నర్సులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, రైతులు, మత్స్యకారులు, వైబ్రంట్ విలేజెస్ సర్పంచులు, తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

beauty-of-muvvannela-on-red-fort
Beauty of Muvvannela on Red Fort

మారిన సంబోధన

ఎర్ర కోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగించడం వరుసగా ఇది పదోసారి. ఈసారి ఆయన దేశ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా సంబోధించారు. ‘‘పరివార్‌జన్’ (కుటుంబ సభ్యులు) అని సంబోధిస్తూ ప్రసంగించారు. గతంలో ఆయన దేశ ప్రజలను ‘‘నా ప్రియమైన సోదర, సోదరీమణులారా’’ అని సంబోధించేవారు.

ఆకర్షణీయ వస్త్ర ధారణ

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆయన సరికొత్త రకం తలపాగా, దుస్తులు ధరించారు. వర్ణరంజితమైన రాజస్థానీ బంధని ప్రింట్ తలపాగాను, ఆఫ్-వైట్ కుర్తా, V-నెక్ జాకెట్, చుడీదార్‌లను ధరించారు. తలపాగా పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఉంది. దీనికి పొడవైన వస్త్రం వేలాడుతూ ఉంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!