27న చలో కలెక్టరేట్
Chalo Collectorate on 27th
సిపిఐ జిల్లా సమావేశంలో గాలి చంద్ర
సిపిఐ జిల్లా కార్యదర్శి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాక
బద్వేలు
కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని విముక్తి చేసి అర్హులైన పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలము ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు రెండు ఎకరాల సాగు భూమి సాధనకై జనవరి 27న జరుగు చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలని స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన సిపిఐ జిల్లా సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇండ్లు ఇస్తాం, ఇంటి స్థలం ఇస్తాం, రేషన్ కార్డుతో పాటు మౌలిక సదుపాయాలైన రోడ్లు, కాలువలు, వీధిలైట్లు, 24 గంటలు త్రాగునీరు అందిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలతో ఓట్లు దండుకొని అధికారంలోకి రాగానే ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలిచ్చి ప్రజలు ప్రజా సమస్యలను పూర్తిగా పక్కకు నెడుతున్నారని వారు ఆరోపించారు. దశాబ్దాల తరబడి పేదలు సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం కోసం అధికారులు అధికార పార్టీ నేతల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న ఫలితం దక్కడం లేదన్నారు. గత ఐదు సంవత్సరాల జగన్ పాలనలో జగనన్న కాలనీల పేరుతో కేవలం ఒక సెంటు జాగా ఇచ్చి తక్షణం ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోకపోతే రద్దు చేస్తామన్న షరతులతో భయపడి ప్రజలు ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీలకు అప్పు తెచ్చి కట్టి చేసిన అప్పు తీర్చుకోలేక తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారన్నారు. నివాసయోగ్యం కానీ ప్రాంతాలలో ఇవ్వడం వల్ల చాలామంది ప్రజలు ఇంటి స్థలాలు తీసుకోవడానికి నిర్మాణం చేపట్టడానికి నిరాకరించారన్నారు. చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి 4 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తి చేయిస్తానని ప్రకటించారన్నారు, తన ఎన్నికల వాగ్దానాన్ని తక్షణము అమలు చేయాలని ఇంటి నిర్మాణ వ్యయాన్ని ఐదు లక్షలకు పెంచి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. భూమి లేని నిరుపేదలకు రెండు ఎకరాల సాగు భూమి ఇవ్వాలన్నారు. పేదలకు ఇంటి స్థలం ఇవ్వడానికి నిరాకరిస్తున్న అధికారులు కళ్ళముందే విలువైన ప్రభుత్వ వంక వాగో చెరువు రాస్తా, అసైన్డ్, దేవాదాయ, ఈనామ్ , వక్ఫ్, అటవీ భూములు చివరకు స్మశానాలు కూడా వదలకుండా ఆక్రమించి అమ్ముకునే డీకేటి మాఫియా కొమ్ము కాస్తున్నారన్నారు.
గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన రి సర్వే 22 ఏ చట్ట సవరణ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రభుత్వ, ప్రైవేటు భూములకు రక్షణ ఉండదని గగ్గోలు పెట్టి తాను అధికారంలోకి రాగానే మూడు చట్టాలను రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆరు మాసాల పాలనలో మొదటి రెండు చట్టాలను పునరుద్ధరించి విలువైన ప్రభుత్వ భూములు పేదల భూములు అడ్డగోలుగా ఆక్రమించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు.
జిల్లాలో ఎక్కడ చూసినా అధికార పార్టీ నేతల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా, ఎమ్మెల్యే ఇంటి సమీపంలో భూ ఆక్రమణలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. గతంలో పోరాడి సాధించుకున్న భూ సంస్కరణ చట్టాన్ని అధికార పార్టీ నేతలు చుట్టంగా మార్చుకొని వందల ఎకరాల భూములు ఆక్రమించుకొని చుట్టూ సోలార్ ఫెన్సింగ్, మధ్యలో విలాసవంతమైన ఫామ్ హౌస్ సంస్కృతిని పెంచి పోషిస్తూ వారి కొమ్ము కాస్తున్న రెవెన్యూ పోలీస్ యంత్రాంగం విధి లేక పేదవాడు జానెడు జాగాలో గుడిసె వేసుకుంటే ఆగ మేఘాల మీద గుడిసె పీకి పెట్టి కేసులు పెట్టి జైలకు పంపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భూములను పరిరక్షించి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు సాగు భూమి పంచాలని సిపిఐ చేపట్టిన దశల వారి పోరాటంలో భాగంగా ఇదివరకే గ్రామ వార్డు సచివాలయాల వద్ద, రెండో దశ తాసిల్దార్ కార్యాలయాల వద్ద మూడోదశ పోరాటంలో భాగంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన జరగనున్నదని, కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి ఈశ్వరయ్య హాజరుకారున్నట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఎన్ వెంకట్ శివ,జిల్లా కార్యవర్గ సభ్యురాలు వి వీరశేఖర్, పి చంద్రశేఖర్, ఎం వి సుబ్బారెడ్డి ఎన్ విజయలక్ష్మి, జి వేణుగోపాల్, బాదుల్లా, జిల్లా సమితి సభ్యులు జి మద్దిలేటి, వెంకట్ రాముడు, మునయ్య, శంకర్ నాయక్, ఇమ్మానుయేల్, హరి, బ్రహ్మం ఏఐఎస్ఎఫ్ శివశంకర్, అరుణ్, చంద్ర తదితరులు పాల్గొన్నారు



