ఇసుక పాయింటు ఏర్పాటుకు కలెక్టర్ ఉత్తర్వులు
జగిత్యాల
భవన నిర్మాణ రంగంలో ఇసుక ప్రాధాన్యతను వివరిస్తూ, ఇసుకను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు జిల్లా కేంద్రంలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కలెక్టర్ యాష్మీన్ భాషా కు లేఖ రాశారు. గతంలో నిర్వహించిన ఇసుక స్టాక్ పాయింట్ ను ఏడాది కాలంగా నిలిపివేయడంతో భవన నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుక అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ గా ఇసుక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని, దీంతో భవన నిర్మాణాలు చేపట్టే వారిపై అదనపు ఆర్థిక భారం పడుతుందని లేఖలో వివరించారు. ఇసుక స్టాక్ పాయింట్ ను తిరిగి ప్రారంభిస్తే, ఇసుక అక్రమ రవాణా నిలువరించడంతోపాటు, నిర్మాణ రంగానికి ప్రభుత్వపరంగా ఇసుక అందుబాటులోకి వస్తుందని తద్వారా నిర్మాణరంగంపై పడే అదనపు ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.గతంలో ఇసుక స్టాక్ పాయింట్ దరూరు క్యాంపు రామాలయం సమీపంలో నిర్వహించారని, ఆ స్థలాన్ని ప్రస్తుతం ప్రభుత్వపరంగా ఇతర అవసరాలకు వినియోగిస్తున్న నేపథ్యంలో పట్టణంలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన సుమారు ఐదు ఎకరాల స్థలాన్ని పరిశీలించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ యాష్మీ న్ భాషా జగిత్యాల పట్టణంలోని శ్రీ రాజ రాజేశ్వర దేవాలయ పరిసరాల్లో అందుబాటులో ఉన్న ఐదు ఎకరాల స్థలంలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణ రంగానికి అతిముఖ్యమైన అవసరమైన ఇసుకను ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉంచేందుకు స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు కోసం కృషి చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.