బీజేపీకి రాముడున్నడు…
కాంగ్రెస్ కు రాక్షసులున్నరు
ఎటువైపు ఉంటారో తేల్చుకోండి
మోదీ మళ్లీ ప్రధాని అయితేనే సబ్సిడీలు అందుతాయి
కాంగ్రెస్ సర్కార్ వద్ద నిధుల్లేవ్… హామీలెట్లా అమలు చేస్తారు?
ఆలోచించి ఓటేయాలని రాష్ట్ర ప్రజలకు బండి సంజయ్ పిలుపు
షాద్ నగర్ నియోజకవర్గంలో సంజయ్ విజయ సంకల్ప యాత్ర
‘‘మా(బీజేపీ) వెనుక మోదీ ఉన్నడు. ఆయన వెనుక శ్రీరాముడున్నరు…. కాంగ్రెస్ వెనుక రాహుల్ గాంధీ, రాక్షసులు, కేసీఆర్, ఒవైసీ ఉన్నరు.. ఎవరు కావాలో తేల్చుకోండి’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ మళ్లీ ప్రధానమంత్రి అయితేనే రైతులకు సబ్సిడీలు అందుతాయని, పేదలకు ఉచిత బియ్యం వస్తాయని, గ్రామాల అభివ్రుద్ధికి కావాల్సిన నిధులు అందుతాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల హామీలను అమలు చేసే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రం వద్ద ఖజానా ఖాళీ అయ్యిందని, ఈ తరుణంలో ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే గత రెండు నెలల్లోనే రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చిన విషయాన్ని సంజయ్ గుర్తు చేశారు. బీజేపీ క్రిష్ణమ్మ విజయ సంకల్ప యాత్రలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం కుందుర్గ్ కు విచ్చేసిన బండి సంజయ్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
5 వందల ఏళ్ల చిరకాల వాంఛ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి రాబోయే తరానికి గర్వంగా చెప్పుకునే అవకాశం కల్పించిన గొప్ప నేత నరేంద్రమోదీకి ప్రతి ఒక్కరూ ఓటేసి ఆశీర్వదించండి.
80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం, ఇంటింటికీ మరుగుదొడ్లు, ఉజ్వల కనెక్షన్లు, ఉచిత కరోనా వ్యాక్సిన్ తోపాటు గ్రామాల అభివ్రుద్దికి నరేంద్రమోదీ ప్రభుత్వం నిధులిస్తుంటే… ఇన్నాళ్లు తామే ఇస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది. ఈ విషయం తెలిసి ప్రజలు ఆ పార్టీని ఓడించారు. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ ఢిల్లీ పర్యటన పేరుతో డ్రామాలు మొదలుపెట్టారు… కేసీఆర్ పనైపోయింది. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థతి లేదు.
ఎన్నికల హామీల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వాటిని అమలు చేసిందా? రాష్ట్రం వద్ద నిధుల్లేవు. హామీలను అమలు చేసే పరిస్థితి లేదు. సంక్షోభంలో ఉన్న తెలంగాణను ఆదుకునే సత్తా బీజేపీకే ఉంది. మా వెనుక మోదీ ఉన్నడు. ఆయన వెనుక శ్రీరాముడున్నరు…. కాంగ్రెస్ వెనుక రాహుల్ గాంధీ, రాక్షసులు, కేసీఆర్, ఒవైసీ ఉన్నరు.. ఎవరు కావాలో ప్రజలు తేల్చుకోవాలి.
మోదీ మళ్లీ ప్రధాని అయితేనే ఎరువుల సబ్సిడీ ఇస్తారు.. ఉచిత బియ్యం అందిస్తారు. గ్రామాలకు నిధులిస్తారు… తెలంగాణ నుండి అత్యధిక మంది ఎంపీలను గెలిపిస్తేనే రాష్ట్రానికి అధిక నిధులు తెచ్చే అవకాశముంది. ఇతర పార్టీలకు ఓట్లేస్తే నిధులెట్లా వస్తాయి? ఆలోచించాలని కోరుతున్నానని అన్నారు.