Friday, January 17, 2025

గులాబీ ఆనవాళ్లను చెరిపేస్తున్న కాంగ్రెస్

- Advertisement -

గులాబీ ఆనవాళ్లను చెరిపేస్తున్న కాంగ్రెస్

Congress is erasing the traces of BRS

హైదరాబాద్, డిసెంబర్ 24, (వాయిస్ టుడే)
మొత్తంగా గులాబీ ఆనవాళ్లు లేకుండా మూడు రంగుల ముచ్చట్లే వినిపించాలని తహతహలాడుతున్న హస్తం అధిష్టానం, శ్రేణుల ఆరాటం ఎంత వరకు సఫలీకృతం అయ్యేది రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో కొలువుదీరిన టీఆర్ఎస్ (బీఆర్ ఎస్) ప్రభుత్వం దాదాపు దశాబ్దం పాటు రెండు పర్యాయాలు కొనసాగింది. పదేళ్ల పాలనలో కేసీఆర్ తనదయిన మార్కు చూపారు. రైతులు, సంక్షేమంపై ఫోకస్ పెంచారు. అన్నదాతకు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా తో పాటు ధరణి వెబ్సైట్ ను అందుబాటులోకి తెచ్చారు. ఆసరా పేరట వృద్దులు, వితంతువులు, దివ్యంగులు, బీడీ కార్మికులకు పింఛన్లను దశల వారీగా పెంచుతూ నెలకు రూ. 2వేల నుంచి 4వేల వరకు అందించారు.సీన్ కట్ చేస్తే … ఏడాది క్రితం గత డిసెంబర్ లో ఆరు గ్యారంటీల హామీతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవర్ లోకి వచ్చీ రాగానే రేవంత్ సర్కారు మూడురంగుల మార్పు కనిపించేలా ఆరోగ్య శ్రీ పరిమితి పెంపుతో పాటు మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అందుబాటులోకి తెచ్చింది. తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 లకే గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ వంటివి ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మూసి ప్రక్షాళన పేరిట హైడ్రాకు తెరలేపింది. ప్రస్తుత ఇందిరమ్మ ఇళ్లపై దృష్టి సారించింది. ఇదంతా నాణేనికి ఒకవైపు.. మరోవైపు బీఆర్ఎస్ ఆనవాళ్లు కనిపించకుండా ఒక్కో అడుగు వేస్తోంది. ముందు చెప్పినట్లుగానే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ధరణి ని రద్దు చేస్తూ భూ భారతిగా పేరు మార్చింది. రెవెన్యూ మంత్రి స్వయంగా శాసనసభలో ధరణి ని బంగాళాఖాతంలో కలిపామంటూ పేర్కొనడం చూస్తే మిగతా పథకాలు కూడా ఇదే జాబితాలో చేరవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్ కిట్ కనుమరుగవగా.. వీఆర్వో వ్యవస్థ తిరిగి తీసుకురావడం, రైతు బంధు ప్రక్షాళన వంటివి సంకేతాలుగా కనిపిస్తున్నాయి.కారు పార్టీ రెండు పర్యాయాల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో అంతా అవినీతి,అక్రమాలే అంటూ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచీ ఆరోపణలు చేస్తూనే ఉంది. కుటుంబ పాలనలో ‘ఆ నలుగురు’ మాత్రమే బాగుపడ్డారని.. వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ లు.. వేల కోట్లు వెనుకేసుకున్నారని రేవంత్ వర్గీయుల నుంచి నిత్యం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహజంగానే ప్రత్యర్తి పార్టీలు చేసే పని ఇదే అయినా..ప్రతీ దానికి అవినీతి మరకలను అంటిస్తూ కమిటీల పేరిట విచారణకు ఆదేశిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరంపై జుడీషియల్ కమిషన్ ఇందుకు తార్కాణం. అలాగే ఫార్ములా వన్, తాజాగా ధరణి లో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణకు ఆదేశించడం వంటివి ఇందులో భాగమేనమి తెలుస్తోంది. గతంలో నిత్యం వార్తల్లో కనిపించిన కేసీఆర్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వరుస ఓటమి తర్వాత ఫార్మ్ హౌస్ కె పరిమితమయ్యారు. విపక్షాలపై తన పదునైన మాటలతో ఎదురుదాడి చేసే గులాబీ బాస్ మౌనం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర అంశమే. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రిపై సానుభూతి రాకుండా పూర్తిగా నెగటివ్ తీసుకు రావాలనే లక్ష్యంగా పావులు కదుపుతోంది కాంగ్రెస్ పార్టీ. రానున్న స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో చర్చ జరగాలని ముందుకు సాగుతోంది. మొత్తంగా గులాబీ ఆనవాళ్లు లేకుండా మూడు రంగుల ముచ్చట్లే వినిపించాలని తహతహలాడుతున్న హస్తం అధిష్టానం, శ్రేణుల ఆరాటం ఎంత వరకు సఫలీకృతం అయ్యేది రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్