ప్రభుత్వ పథకాల పక్కా అమలుకు నిరంతర అభిప్రాయ సేకరణ
Continuous feedback collection for proper implementation of government schemes
లబ్ధిదారుల నుంచి సేకరించిన సర్వే ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
పథకాల అమలులో ఏ స్థాయిలో కూడా సిబ్బంది, ఉద్యోగుల అలసత్వం కనిపించకూడదన్న సిఎం చంద్రబాబు
అమరావతి:-
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడా అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం కనిపించకూడదని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు సక్రమంగా జరగాలని….ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకుని పనిచేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల నిర్వహణపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై సిఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష చేశారు. పింఛన్ల పంపిణీ, అన్న క్యాంటీన్, ఎరువులు పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం వంటి అంశాలపై ప్రజల నుంచి ఐవిఆర్ఎస్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో పాటు పలు మార్గాల్లో నిర్వహించిన సర్వే నివేదికలపై సిఎం సమీక్షించారు. కొన్ని ప్రభుత్వ పథకాల అమలులో అక్కడక్కడా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఫీడ్ బ్యాక్ పై సమగ్రంగా విచారించి పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఒక వ్యక్తి పింఛను ఇంటి వద్ద అందడం లేదని ఫిర్యాదు చేసినా, దీపం పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీలో సమస్యలు వచ్చినా, అవినీతి ఉన్నా, ఆసుపత్రిలో సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసినా వాటిపై చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాలపై ప్రజల స్పందన లో అసంతృప్తి వ్యక్తం చేసిన సదరు లబ్దిదారుల వద్దకు వెళ్లి కారణాలు విశ్లేషించాలని సూచించారు. వ్యక్తుల వల్ల గాని, వ్యవస్థలో లోపాల వల్లగాని సమస్య ఉన్నట్లు తేలితే….ప్రతి కాల్ పై విశ్లేషించి చర్యలు తీసుకోవాలని సూచించారు. పొరపాట్లు జరిగితే సరిదిద్దాలని..అయితే ఉద్యోగుల నిర్లక్ష్యం, అవినీతి ఉంటే మాత్రం సహించవద్దని సీఎం స్పష్టం చేశారు. గ్యాస్ పంపిణీ విషయంలో ఎక్కడైనా అవినీతి జరిగితే…గ్యాస్ ఏజెన్సీలను బాధ్యులను చేయాలని సిఎం సూచించారు.