నిర్మల్ లో మాస్టర్ ప్లాన్ రకడ
అదిలాబాద్, ఆగస్టు 21: నిర్మల్ టౌన్ మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ అలజడి రేపుతోంది. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం ఐదు రోజులుగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో కుటుంబసభ్యులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మహేశ్వర్‌రెడ్డికి పరీక్షలు చేసిన వైద్యులు.. షుగర్, బీపీ లెవెల్స్ పడిపోయినట్టు గుర్తించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. పోలీసులు ఆయన్ను నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. హై మైగ్రేన్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే, హైదరాబాద్ తరలించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. నిర్మల్‌లోనే చికిత్స అందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.కాగా.. నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేసే దాకా పోరాటం ఆపబోనని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తేల్చి చెప్పారు. టీవీ9తో మాట్లాడిన ఏలేటి ఆస్పత్రిలోనే ఆమరణదీక్ష కొనసాగిస్తానన్నారు. పోలీసులు అర్ధరాత్రి దొంగచాటుగా దీక్షను భగ్నం చేశారని.. అయినా దీక్షను కొనసాగిస్తానన్నారు. మరోవైపు హాస్పిటల్‌ల్‌కి చేరుకున్న కుటుంబసభ్యులు.. ఏలేటీ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌కు తరలించాలని వైద్యులు సూచించినప్పటికీ.. కుటుంబసభ్యులు మాత్రం నిరాకరించారు. నిర్మల్‌లోనే వైద్యం అందించాలని కోరారు.నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు రగడ కొనసాగుతూనే ఉంది. బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్, ఏలేటీ దీక్ష భగ్నం చేసి ఆస్పత్రికి తరలింపు వేళ.. మహేశ్వర్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది బీఆర్‌ఎస్. మున్సిపల్ చైర్మన్ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అలర్టయ్యారు. మహేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లే మార్గాలను మూసివేశారు. మరోవైపు ఇవాళ ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని పరామర్శించేందుకు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి నిర్మల్ రానున్నట్లు ప్రకటించారు. అలాగే పోలీసుల లాఠీఛార్జ్‌లో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను కూడా కిషన్ రెడ్డి పరామర్శించాలనుకున్నారు. ఓ వైపు ముట్టడి.. మరోవైపు కిషన్ రెడ్డి టూర్‌తో పోలీసులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి నిర్మల్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. అత్యవసర సమావేశం ఉండటంతో పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది.