నిజామాబాద్, నవంబర్ 10, (వాయిస్ టుడే ): నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటన ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. బీఆర్ఎస్ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వగా, బీజేపీ, కాంగ్రెస్ నుంచి అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. టికెట్ల కోసం ఆశావాహుల పోటాపోటీల అనంతరం ఎట్టకేలకు అభ్యర్థులను ప్రకటించారు. కానీ ఈ సారి బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల నుంచి స్థానికులకు కాకుండా స్థానికేతరులను అభ్యర్థులుగా బరిలో దింపడం గమనార్హం. బీజేపీ నుంచి నిజామాబాద్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణను ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక కాంగ్రెస్ తర్జనభర్జనల అనంతరం బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పుడు ఇదే అంశం అధికార పార్టీగా కలిసిరానుందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన వారు ఆ తరువాత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. సరిగ్గా ఇదే సెంటిమెంట్‌ను నమ్ముకుని విపక్షాలు ఎన్నికల బరిలోకి దిగాయి. అయితే నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులే మళ్లీ తమకు పట్టం కట్టిస్తాయని పోచారం శ్రీనివాసరెడ్డి నమ్మకంగా ఉన్నారు. పైగా దశాబ్దాల సెంటిమెంట్ ఈ ఎన్నికతో తుడిచిపెట్టుకపోతుందని ధీమాగా ఉన్నారు.స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈసారి ఎన్నికల్లో అభివృద్ధి జపంతో ముందుకు వెళ్తున్నారు.
సీఎం నియోజకవర్గం గజ్వేల్ కంటే ఎక్కువ డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఒక్క బాన్సువాడలో నిర్మించడం ఈ ఎన్నికల్లో కలిసి వస్తుందని భావిస్తున్నారు. బాన్సువాడలో మొత్తం 11 వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి పేదలకు పంచారు. అలాగే రూ.200 కోట్లతో సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. కేటీఆర్ ఈ రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. పైగా 2100 మంది గిరిజనులకు పోడు పట్టాలు అందజేశారు. ఇక పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన రైతుబంధు, బీమా ఇవన్నీ పథకాలు ఈసారి కలిసి వస్తాయన్న ధీమాతో ఉన్నారు. పైగా బాన్సువాడ నియోజకవర్గంలో 41 వేల మందికి ఆసరా పింఛన్లు అందజేస్తున్నారు. వీరంతా బీఆర్ఎస్‌కు అండగా ఉంటారని పోచారం నమ్మకంగా ఉన్నారు. దశాబ్దాల కాలంగా ఉన్న స్పీకర్ ఓటమి సెంటిమెంట్‌ను తన విజయంతో తుడిచిపెట్టాలని దృఢనిశ్చయంతో ఉన్నారు. ఆయనకు తోడుగా ఆయన కుమారుడు, డీసీసీబీ ఛైర్మన్ భాస్కర్‌రెడ్డి, మరో కుమారుడు సురేందర్‌రెడ్డి ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల్లో ఉంటూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. చివరి జాబితాలో బాన్సువాడ అభ్యర్థిగా ఏనుగు రవీందర్‌రెడ్డిని ఖరారు చేసింది. ఈ స్థానం కోసం గత ఎన్నికల్లో పోటీ చేసిన కాసుల బాల్‌రాజుతో పాటు రుద్రూరు సర్పంచ్‌గా ఉన్న ఇందూరి చంద్రశేఖర్ అలాగే బీజేపీ ఉండి కాంగ్రెస్ బాన్సువాడ టికెట్టు కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించిన మల్యాద్రిరెడ్డి కూడా ఉన్నారు. కానీ అధిష్టానం ఏనుగు వైపు మొగ్గు చూపింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జాజుల సురేందర్ చేతిలో ఎల్లారెడ్డిలో ఏనుగు రవీందర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. ఎల్లారెడ్డి నుంచి అభ్యర్థిని తీసుకొచ్చి బాన్సువాడలో ప్రకటించడంపై కాంగ్రెస్ శ్రేణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఇందూరి చంద్రశేఖర్‌ను అభ్యర్థిగా ప్రకటించాలని స్థానిక నాయకులు కోరారు. పైగా బాన్సువాడ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న సెటిలర్లు కూడా చంద్రశేఖర్‌కు మద్దతు ప్రకటించారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో చంద్రశేఖర్ ముందున్నారు. కానీ ఆయనను కాదని రవీందర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు.బీజేపీ నుంచి మల్యాద్రి రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించాలనుకున్నప్పటికీ.. ఆయన కాంగ్రెస్ టికెట్టు కోసం దిల్లీ నేతలతో మంతనాలు జరుపుతుండటంతో ఆ స్థానంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణను ప్రకటించారు. అయితే స్పీకర్లుగా బాధ్యతలు నిర్వర్తించిన వారు తరువాత ఎన్నికల్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సెంటిమెంట్‌తోనే తనకు విజయం వరిస్తుందని ఆయన భావిస్తున్నారు. ఇక తన సామాజిక వర్గం కూడా తనకు కలిసి వస్తుందని నమ్మకంతో ఉన్నారు.