- Advertisement -
కరీంనగర్ లో ఎన్నికల సందడి
Election buzz in Karimnagar
కరీంనగర్, అక్టోబరు 19, (వాయిస్ టుడే)
తెలంగాణలో మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక రాబోతుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్‌కు త్వరలోనే నోటిఫికేషేన్ రాబోతుంది. అయితే ఇప్పటికే పార్టీలు, పలువురు ఆశావహులు ప్రచారంలో బిజీగా ఉన్నారు. బీఆర్ఎస్ మాత్రం కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటులో పోటీపై డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది.లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి..వరంగల్ గ్రాడ్యుయేట్ బైపోల్‌లో ఓటమి తర్వాత పరిస్థితుల నేపథ్యంలో పోటీ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నట్లు టాక్. పోటీ చేస్తే ఎలా ఉంటుంది.? గెలుపు అవకాశాలు ఉన్నాయా.? ఓడితే పార్టీపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై పక్కాగా సర్వేలు చేస్తోందట.ఎమ్మెల్సీ బరిలో నిలవకపోతేనే బెటరనే భావనలో గులాబీ పెద్దలు ఉన్నట్లు టాక్. ఆశావహులు మాత్రం పోటీ చేస్తేనే సత్తా చాటుకోవచ్చని..మొదటి నుంచి కారు పార్టీకి కలిసి వచ్చిన కరీంనగర్ స్థానంలో మళ్లీ పాగా వేయడం ద్వారా పూర్వవైభవం తెచ్చుకోవచ్చని పార్టీ పెద్దలను కోరుతున్నారట. ఎవరెన్ని చెప్పినా గులాబీబాస్ కేసీఆర్ మదిలో ఏం ఉందన్నది మాత్రం అంతుచిక్కడం లేదంటున్నారు.అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు, బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు రెడీ అవుతున్నాయి. గతంలో ఈ ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు వరుసపెట్టి గెలిచారు. నారదాసు లక్ష్మణ్, స్వామిగౌడ్..ఇలా వరుసగా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం కారు పార్టీ అధికారికంగా అభ్యర్థిని బరిలో దింపలేదు. స్వతంత్ర అభ్యర్థి, ఉద్యోగ సంఘం నేత చంద్రశేఖర్‌గౌడ్‌కు మద్దతు తెలిపింది.ఆ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలిచారు. అలా బీఆర్‌ఎస్ కంచుకోటను కైవసం చేసుకున్న కాంగ్రెస్.. ఈసారి ఎలాగైన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. ఇక కేంద్రమంత్రి సంజయ్‌తో పాటు ముగ్గురు ఎంపీలు రఘునందన్‌రావు, అరవింద్, నగేష్‌లతో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న పట్టభద్రుల నియోజకవర్గాన్ని ఎలాగైనా గెలిచి తీరాలని బీజేపీ వ్యూహ రచన చేస్తోంది.అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో బోణీనే కొట్టలేదు. ఇక వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చినా గెలువ లేకపోయింది. దీంతో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నిక బీఆర్‌ఎస్‌కు సవాల్‌గా మారింది. దీని పరిధిలోనే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుల నియోజకర్గాలు కూడా ఉన్నాయి.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే పార్టీ బలోపేతానికి దోహద పడుతుందని కొందరు నేతలు అంటున్నారు. కానీ మరోసారి ఓటమి పాలైతే పార్టీ జనాల్లో పలుచనపడే అవకాశం ఉందన్న చర్చ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాహసం చేయడం ఎందుకనేది అధినేత ఆలోచనగా తెలుస్తుంది.పోటీ విషయంలో అధిష్టానం డైలమాలో ఉన్నప్పటికీ ..కరీంనగర్ మాజీ మేయర్, రవీందర్ సింగ్ మాత్రం పోటీకి రెడీ అయిపోతున్నారు. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రంగంలోకి దిగాలని ఆసక్తిరేపుతోంది. మరికొందరు తటస్థులు , డాక్టర్లు, టీచర్లు కూడా బీఆర్‌ఎస్ టిక్కెట్ ప్రయత్నం చేస్తున్నారు.అయితే కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉండే రవీందర్‌సింగ్ పోటీకి సిద్ధం అవుతుండటం కరీంనగర్ రాజకీయాన్ని కాకపుట్టిస్తోంది. కేసీఆర్ నో అంటే..రవీందర్ సింగ్ ఏం చేస్తారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంతకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బరిలో నిలుస్తుందా.? తప్పుకుంటుందా.? అనేది మాత్రం నోటిఫికేషన్ వస్తేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
- Advertisement -