- Advertisement -
చలి పండుగకు అంతా సిద్ధం
Everything is ready for the cold festival
విశాఖపట్టణం, జనవరి 29, (వాయిస్ టుడే)
అరకు వెళ్లే వారికి సూపర్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలంలో మంచు దుప్పటి కప్పుకున్న ప్రకృతి అందాలను చూడ్డానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి కూడా అరకు లోయకు సందర్శకులు తరలివస్తుంటారు. శీతాకాలంలో అరకు లోయ అందాలను చూసి మైమరిచిపోతుంటారు. అలాంటి సందర్శకుల ఆనందాన్ని రెట్టింపు చేసేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల తర్వాత మళ్లీ అరకు ఉత్సవ్ నిర్వహిస్తోంది. అరకు ఉత్సవ్ 2025 పేరిట ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.జనవరి 31 నుంచి మూడు రోజుల పాటు అరకు ఉత్సవ్ నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. తాజాగా అరకు ఉత్సవ్ నిర్వహణకు కోటి రూపాయలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అరకు చలి పండుగకు కోటి రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అరకు ఉత్సవ్‌తో పాటుగా ఫ్లెమింగ్ ఫెస్టివల్‌కు కూడా కోటి రూపాయలు మంజూరు చేశారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకూ అరకు చలి పండుగ జరుగుతుంది. అరకు ఉత్సవ్ కోసం అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే అల్లూరి జిల్లా కలెక్టర్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించారు. అరకు ఉత్సవ్ చూడటానికి పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.మరోవైపు 2020 ఫిబ్రవరిలో ఆఖరిసారిగా అరకు ఉత్సవ్ నిర్వహించారు. ఆ కార్యక్రమం సూపర్ హిట్టైందని అధికారులు చెప్తున్నారు.. అయితే ఆ తర్వాతి కాలంలో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించలేదు. తాజాగా గత అరకు ఉత్సవ్‌ని నిర్ణయించాలని.. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన సంస్కృతిని చాటి చెప్పాలని అల్లూరి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం అనుమతించింది. ఇక అరకు ఉత్సవ్ ప్రారంభానికి గుర్తుగా జనవరి 31 ఉదయం మారథాన్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.అరకు ఉత్సవ్‌లో భాగంగా జనవరి 31న పద్మాపురం గార్డెన్స్‌లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జానపద కళాకారులతో కార్నివాల్, ఫ్లవర్ షోను ఏర్పాటు చేశారు. అరకు కాఫీ, గిరిజనులు తయారు చేసిన హస్తకళా రూపాలతో స్టాళ్లు, వన్ ధాన్, ఫుడ్ స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండో రోజు 20 కి.మీ సైక్లింగ్, పాఠశాల విద్యార్థులకు పోటీలు, ఫ్యాషన్ షో, టాలెంట్ షో నిర్వహించనున్నారు. అరకు ఉత్సవ్ నేపథ్యంలో అరకు ప్రాంతంలోని అన్ని టూరిజం హాట్‌స్పాట్‌ల వద్ద ‘నో ప్లాస్టిక్ జోన్’ ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. సందర్శకులు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.
- Advertisement -