తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం రూరల్ భద్రాచలం పట్టణంలోని మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి కార్యాలయంలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై అనుమానాలు. ఈ ప్రమాదంలో కార్యాలయానికి సంబంధించిన కీలక ఫైళ్లు దగ్ధమైనట్టు ప్రత్యేక అధికారి నాగలక్ష్మి తెలియజేశారు. మూడు రోజులుగా తుఫాన్ ప్రభావంతో వర్షానికి తోడు పట్టణ వ్యాప్తంగా ముసురు నెలకొన్న నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయం జరిగిన అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పట్టణానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పాలకమండలి లేకపోవటంతో ప్రభుత్వ కార్యకలాపాలను, అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రత్యేక అధికారిని నియమించి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నుంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే మార్పు చెందిన కొద్ది రోజుల్లోనే మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి కీలక ఫైల్స్ దగ్ధమవడంతో సిబ్బంది తీరుపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మండల ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జరిగిన అగ్నిప్రమాదంతో వాటికిమరింత బలం చేకూరింది. గతంలో బీసీ రుణాలతో పాటు ఆసరా పింఛన్లు, ఈజీఎస్ పనులలో కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారన్న విమర్శలు రావడంతో పాటు వరదల సమయంలో విపత్తు నిధుల ఖర్చుల వ్యవహారంలోనూ అనేకారోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇంత పెద్ద అగ్ని ప్రమాదం కాకతాయకంగా జరిగిందా కావాలనే చేశారా అన్నదానిపై విచారణ చేయబడితే తప్పా, పూర్తి నిజనిజాలు బయటకు రావు. అగ్ని ప్రమాద ఘటన తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాద తీరుని పరిశీలించి ప్రత్యేక అధికారి నాగలక్ష్మితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదంపై పట్టణ సీఐ నాగరాజు రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనేక అవినీతి ఆరోపణలకు కేంద్ర బిందువైన మండల ప్రజా పరిషత్ కార్యాలయ అగ్ని ప్రమాదంపై పోలీసు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు ప్రజలకు తెలియజేయాలని వివిధ రాజకీయ పార్టీల పెద్దలు కోరుతున్నారు.