*గాంధీభవన్ కూలుతుంది*
*• కాంగ్రెస్ నాయకులకు బిఆర్ఎస్ నేతల హెచ్చరిక*
*• కాంగ్రెస్ నేతలు ఆత్మ విమర్శన చేసుకోవాలని సూచన*
*వరంగల్ జిల్లా:* కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే హనుమకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని.. హనుమకొండ కార్యాలయం జోలికి రావొద్దని టార్గెట్ కావొద్దని బిఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. హనుమకొండ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం చట్టవిరుద్దంగా నిర్మించారని, వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మున్సిపల్ అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశించిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు హాట్ కామెంట్స్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఒక్క ఇటుక పెళ్ల కదిపిన గాంధీభవన్ కూలుతుందని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి జీవోను అప్పుడున్నటువంటి నామినల్ రేట్ ప్రకారము ఇవ్వడం జరిగిందని.. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి బోయినపల్లి మెయిన్ రోడ్ లో 10 ఎకరాల భూమిని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ కు కేటాయించారని, అది కూడా అదే జీవోను అనుసరించి కేటాయించారని అన్నారు. జీవోలను అనుసరించి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయాలకు భూమిలను కేటాయించారని, వాటి జోలికి వస్తే జాగ్రత్త అని అన్నారు. మీరు మీ మంత్రులు వెంటనే సమావేశమై మాట్లాడుకోవాలని, ఆత్మ విమర్శన చేసుకోవాలని సూచనలు చేశారు.