వ్యాయామానికి అరగంట కేటాయించాలి
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
కామారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 29 (వాయిస్ టుడే): మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి క్రీడలు, వ్యాయామం ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరు చదువుతో పాటు తమకిష్టమైన ఏదో ఒక క్రీడలో రాణించాలని, రోజులో కనీసం అరగంట వ్యాయామానికి కేటాయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ యువతకు పిలుపునిచ్చారు. హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చాంద్ 118 వ జయంతి సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డిలోని కళాభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం విద్యార్థిని,విద్యార్థుల నుద్దేశించి మాట్లాడారు. హాకీ క్రీడకు వన్నె తెచ్చి దేశ కీర్తిని పెంచిన ఆణిముత్యం ధ్యాన్ చంద్ అని ఆయన జయంతిని ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తున్నదని,అందులో భాగంగా యువతలో క్రీడలపట్ల అవగాహన కలిగించుటకు, క్రీడాకారులను ప్రోత్సహించుకు చలో మైదాన్ పేర కార్యక్రమం నిర్వహిసున్నామని అన్నారు. నేటి యువత చరవాణిలకు బానిసలవుతున్నారని, ప్రపంచ పోకడ, జ్ఞాన సముపార్జనకు చరవాణిలు అవసరమైన క్రీడల, వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని, తద్వారా కండరాలు దృడపడతాయని అన్నారు, విద్యార్థి దశలోనే ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించాలని, తరువాత ఫిట్ నెస్ పై దృష్టిపెట్టె సమయం లభించదని అన్నారు. ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదని, తర్ఫీదు పొందిన శిక్షకులు, వ్యాయామ ఉపాధ్యాయులు వివిధ క్రీడలలో శిక్షణ ఇస్తున్నారని అన్నారు. స్థానిక ఇందిరా గాంధి స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిమ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచ స్థాయిలో రాణించే సత్తా మీలో ఉందని, ఆత్మన్యూనతాభావం విడనాడి క్రీడలలో పాల్గొంటే సమాజంలో ఎదురయ్యే ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ధైర్యం వస్తుందని అన్నారు. . దేశస్వాతంత్య్ర సంగ్రామంలో యువత త్యాగాలు మరువలేనివని, వారిలో ఉన్న ఉద్యమ స్ఫూర్తి ని కొంతైనా యువత అలవర్చుకుని అంకితభావంతో పనిచేస్తే ఉన్నత శిఖరాలు అందుకుంటారని అన్నారు.
ఈ సందర్భంగా 18 ఏళ్ళు నిండిన యువత వంద శాతం ఓటరుగా పేరునమోదు చేసుకోవాలని, తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అంతకుముందు స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి ఓటరు నమోదు పై అవగాహన కలిగించారు. అనంతరం రాష్ట్ర, జాతీయ క్రీడలలో రాణించిన క్రీడాకారులు, వ్యాయమ ఉపాధ్యాయులు, శిక్షకులను కలెక్టర్ శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డి, పరీక్షల విభాగం సహాయ సంచాలకులు లింగం, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి ,డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నాయబ్ రసూల్, క్రీడా సంఘాల కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా బాన్సువాడలో ప్రొఫెసర్ జయ శంకర్ సర్ మినీ స్టేడియం లో శాసన సభాపతి ముఖ్య అతిధిగా హాజరై ఖో ఖో క్రీడలను ప్రారంభించారు. ఇందులో 22 జట్లు పాల్గొనగా, కామారెడ్డి లోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన హాకీ క్రీడలలో 11 జట్లు పాల్గొన్నారు.