ఇందిరా పార్కులో కబ్జాలకు హైడ్రా చెక్
పాత స్కేటింగ్ రింగ్ స్థలాన్ని కాపాడిన హైడ్రా
పార్కులో కలపాలంటూ హైడ్రా కమిషనర్ ఆదేశం
Hydra Check on Encroachments in Indira Park
హైదరాబాద్, మార్చి 30:
లోయర్ ట్యాంక్ బండ్‌లోని ఇందిరా పార్కు కబ్జాలకు హైడ్రా చెక్ పెట్టింది. పార్కులో వాకింగ్ ట్రాక్ లకు తోడు పిల్లలు ఆడుకునేందుకు చుట్టూ ఏర్పాటు చేసిన స్థలాల కబ్జాలపై హైడ్రా కన్నెర్రజేసింది. పాత స్కేటింగ్ రింగ్ కబ్జాకు గురౌతోందని ప్రజావాణిలో వాకర్స్ నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు సోమవారం హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నిర్మాణ సామగ్రితో పాటు.. ఇందిరాపార్కు లోపలి వైపు ఉన్న ప్రహరీ తొలగించడాన్ని సీరియస్గా పరిగణించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిర్మాణాలను ఆపించి.. ప్రహరీని పునరుద్ధరించాలని ఆదేశించారు. కొత్త స్కేటింగ్ రింగ్ అందుబాటులోకి వచ్చినందున.. పాతదాన్ని ఇందిరాపార్కులో విలీనమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
* ప్రజావాణి ఫిర్యాదు ఇలా..
ఇందిరాపార్కులో కొత్త స్కేటింగ్ రింగ్ అందుబాటులోకి రావడంతో గతంలో ఉన్న చిన్న స్కేటింగ్ రింగ్ ఖాళీగా ఉంది. ఇక ఈ స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. సమ్మర్ క్యాంప్ పేరుతో కరాటే నేర్పుతానని సఫీ అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు. వేసవి కాలం తర్వాత కూడా కరాటే శిక్షణ కేంద్రంగా వినియోగించుకుంటూ పిల్లల వద్ద ఫీజులు వసూలు చేస్తున్నాడు. అక్కడితో ఆగకుండా.. సామ్రాజ్యాన్ని విస్తరించాలని ప్రయత్నించాడు. ఎమ్మెల్యే నిధులు కేటాయించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యేను కలిశాడు. ఈమేరకు రూ. 30 లక్షలు కేటాయించాలంటూ స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపారు. జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చి సంబంధిత శాఖ నుంచి అనుమతులు తీసుకురావాలని సూచించారు. అనుమతులుంటే నిధులు మంజారు చేస్తామన్నారు.
* అనుమతుల గురించి ఆగకుండా..
ఈ అనుమతులు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని భావించాడో.. లేక అనుమతులవే వస్తాయి.. ఈ లోగా పనులు కానిచ్చేద్దామనుకున్నాడో ఏమో కాని.. కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డికి ఆ పనులు అప్పగించాడు. అందులో నిర్మాణాలు చేపట్టడానికి సంబంధిత స్టీల్ రాడ్డులు, నిర్మాణ సామగ్రీ డంప్ చేశాడు. చిన్న స్కేటింగ్ రింగ్లోకి జేసీబీ వెళ్లేందుకు వీలుగా ప్రహరీని తొలగించాడు. ఇందిరాపార్కు నిర్వహణకు చెందిన (జీహెచ్ ఎంసీ) కార్యాలయం చెంతనే ఇదంతా జరుగుతున్నా.. పట్టించుకోవడంలేదని భావించిన వాకర్స్ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. జీహెచ్ ఎంసీ క్రీడా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ని సంప్రదించింది. దీంతో కదలిక మొదలైంది. ఇందిరాపార్కు లోపలి వైపు నుంచి స్కేటింగ్ రింగులోకి వెళ్లేందుకు వీలుగా ప్రహరీని కూల్చిన రవీందర్ రెడ్డిపై దోమలగూడ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. సోమవారం హైడ్రా కమిషనర్ ఈ పరిణామాలన్నిటీనీ పరిశీలించి.. కొత్త స్కేటింగ్ రింగ్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పాత స్థలాన్ని ఇందిరా పార్కులో కలిపేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.



