- Advertisement -
అసెంబ్లీకి వెళ్లకపోతే వేటేనా…
If you don't go to the assembly...
విజయవాడ, ఫిబ్రవరి 4, (వాయిస్ టుడే)
వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి రాకపోతే అనర్హతా వేటు పడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. అరవై రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హతా వేటు ఆటోమేటిక్ గా పడుతుందని.. పులివెందులకు ఉపఎన్నికలు వస్తాయన్నారు. అయితే ఇక్కడ ఓ నిబంధన వర్తిస్తుందని ఆయన చెప్పారు. ముందుగా స్పీకర్ అనుమతి తీసుకుని గైర్హాజరు కావొచ్చు. ఎలాంటి అనుమతి లేకుండా సమాచారం లేకుండా మాత్రం అసెంబ్లీకి వెళ్లకపోతే సభ్యులపై అనర్హతా వేటు వేయవచ్చునని ఆయన ప్రకటించారు.వైఎస్ జగన్ లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరవాత ఆయన తన వ్యూహం మార్చుకున్నారని అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ఆయన రావాలని తన వాదన వినిపించుకోవాలని రఘురామ అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు. ఆ తర్వాత వెళ్లలేదు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పంపడం లేదు. దాంతో అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేలుగా వారు విమర్శలు ఎదుర్కొంటున్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వేధిస్తున్నారని జగన్ అంటున్నారు. తాను తప్ప మరో పార్టీ ప్రతిపక్షంగా లేదని అలాంటప్పుడు తాను ప్రతిపక్షం కాకుండా మరేమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రతిపక్షం కాదని ఎవరన్నారని..ప్రధాన ప్రతిపక్షం హోదా మాత్రం ప్రజలు ఇవ్వలేదని టీడీపీ నేతలంటున్నారు. జగన్ అసెంబ్లీకి హాజరవుతారని.. వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నెలలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జగన్ లండన్ నుంచి వచ్చినప్పటి నుంచి ఈ ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఆయన విజయవాడకు వచ్చారు. ఈ అంశంపై ఎమ్మెల్యేలకు ఏమైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. వైసీపీ సోషల్ మీడియా మాత్రం ప్రచారం చేస్తోంది. ఒక వేళ అనర్హతా వేటు వేస్తే ఉపఎన్నికలు వస్తాయి. ఉపఎన్నికల్లో పులివెందుల సీటు కోసం కూడా పోరాడాల్సి వస్తుంది. ఇప్పటికే అక్కడ నీటి సంఘం ఎన్నికల్లో కూడా పోటీ చేయలేకపోయారు. ఇది చాలా రిస్క్ అవుతుందని అనుకుంటున్నారు. జగన్ రిస్క్ లేకుండా ఒకటి, రెండు రోజుల్లో సభకు హాజరై ఆ తర్వాత మరో రెండు, మూడు సెషన్లు రాకుండా ఉండవచ్చని చెబుతున్నారు.అయితే హోదా ఇచ్చే వరకూ అసెంబ్లీకి కి వచ్చేది లేదని జగన్ ప్రకటించారు. హోదా ఇవ్వకపోవడం అధికార కూటమి తప్పని తనను అవమానిస్తున్నారని..అంటున్నారు. ఇప్పుడు అనర్హతా వేటు భయంతో అసెంబ్లీకి వెళ్తే ఎగతాళి చేస్తారని.. అనర్హతా వేటు వేసినా సరే అసెంబ్లీకి వెళ్లేది లేదని ఆయన పట్టుబట్టే అవకాశం ఉందంటున్నారు. అసెంబ్లీకి వెళ్లడం లేదని అందరిపై అనర్హతావేటు వేస్తే అదో దేశవ్యాప్త చర్చ అవుతుందని అలాంటిది జరగాలని ఆయన కోరుకుంటారని అంటున్నారు.
- Advertisement -