తిరుమల నాలుగు మాడ వీధుల్లో టిటిడి ఛైర్మన్ పరిశీలన
Inspection of TTD Chairman in four mada streets of Tirumala
తిరుమల,
ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా తిరుమల మాడ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను టిటిడి పాలకమండలి సభ్యులు, టిటిడి ఈవో జె శ్యామల రావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇంఛార్జి సివిఎస్వో మణికంఠ చందోలుతో కలిసి శుక్రవారం సాయంత్రం ఛైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు.
తిరుమల మాడ వీధుల్లో భక్తుల సౌకర్యార్థం వేసిన చలువ పందిళ్లను, గ్యాలరీల్లోకి భక్తుల ప్రవేశం, నిష్క్రమణ, అత్యవసర గేట్లను, భక్తులు నడిచే సమయంలో వేడి లేకుండా వైట్ పెయింట్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. గ్యాలరీలలోని భక్తులకు ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ద్వారా సమాచారం చేరవేసేలా ప్రకటనలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. భక్తులు గ్యాలరీలోకి ప్రవేశించాక వారికి కావాల్సిన అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ తదితర సౌకర్యాలను క్రమం తప్పకుండా అందించాలని కోరారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులు సౌకర్యవంతంగా శ్రీవారి వాహన సేవలను వీక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తొలుత వాహన మండపానికి చేరుకున్న టిటిడి ఛైర్మన్, పాలక మండలి సభ్యులు, టిటిడి ఈవో, అదనపు ఈవో, తిరుపతి జేఈవో, ఇంఛార్జి సివిఎస్వో, టిటిడి అధికారులు నాలుగు మాడ వీధుల్లో కలియ తిరిగారు.