- Advertisement -
రాష్ట్రానికి అంతర్జాతీయ సంస్థలు
International Organizations to State
హైదరాబాద్, జనవరి 28, (వాయిస్ టుడే)
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల రాకపై సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. తన దావోస్ పర్యటన గురించి సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మంత్రులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. పెట్టుబడుల సాధనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘన విజయం సాధించిదన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక 14 నెలల్లో ప్రజల విశ్వాసాలను చూరగొన్నామని సీఎం అన్నారు, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమకు అప్పగించిన భాద్యతను తాము నిర్వహిస్తున్నామన్నారు.దావోస్ పర్యటనలో ఎన్నడూ ఊహించని రీతిలో రూ. 1.80 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు తమతో ఒప్పందం కోసం ముందుకు వచ్చాయని, రాష్ట్రంలోని యువతకు ఈ ఒప్పందాల ద్వార ఉపాధి దొరుకుతుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి సింగపూర్ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, మన విద్యార్థులు సింగపూర్ కు వెళ్లి శిక్షణ పొందే అవకాశం ఉంటుందన్నారు.తెలంగాణ ఆర్థిక స్థితిని దెబ్బకొట్టేందుకు ఎందరో ప్రయత్నిస్తున్నారని, కానీ సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించడం గర్వించదగ్గ విషయమన్నారు. హైదరాబాద్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్రలు చేశారని, ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించారన్నారు. పక్కా ప్రణాళికతో దావోస్ కు వెళ్లాం కనుకే అన్ని పెట్టుబడులు సాధించామని సీఎం అన్నారు. 13 నెలల్లో రూ.లక్షా 80వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని సీఎం మరోమారు పునరుద్ఘాటించారు.తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమీలో చేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కిల్ యూనివర్శిటీ స్థాపనతో యువతకు నైపుణ్యతతో కూడిన విద్యను అందిస్తామన్నారు. ప్రస్తుతం పెట్టుబడుల రాకతో, తెలంగాణ నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పనతో పాటు ఉపాధి అవకాశాలు చేరువ అవుతాయన్నారు. గతం కంటే 4 రెట్లు ఎక్కువగా పెట్టుబడులు సాధించడం తనకు ప్రజలు ఇచ్చిన బృహత్తర అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో అడుగులు పెడుతున్నాయన్నారు. రాజకీయంగా కొందరు తమను విభేదించినా, వాటిని తాము స్వీకరించి సలహాలుగా మార్చుకున్నామన్నారు. రాష్ట్రంలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు ప్రజా సంక్షేమ పథకాలు సాగిస్తూ.. మరోవైపు అభివృద్ది వైపు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ఎమ్మేల్యేలు పాల్గొన్నారు.
- Advertisement -