సర్దార్ పాపన్న గౌడ్ ఆలోచనలకు అనుగుణంగా జగనన్న పాలన
—-డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహావీరుడని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవదాయ ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం నీలాద్రిపురం లో ఆ గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని గురువారం మంత్రి కొట్టు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మొగల్ చక్రవర్తులను ఎదిరించి వీరోచితంగా పోరాడిన పాపన్న గౌడ్ జీవితం అందరికీ ఆదర్శం కావాలన్నారు. అణగారిన బడుగు బలహీన వర్గాల తరఫున కొన్ని వందల సంవత్సరాల క్రితమే పోరాడిన చరిత్ర పాపన్న గౌడ్ ది అన్నారు. పాపన్న గౌడ్ జీవిత చరిత్ర తెలుసుకుంటే అణగారిన వర్గాల కోసం ఆయన ఎంతగా పోరాడారో అర్థం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన పాపయ్య గౌడ్ ఆలోచనలకు దగ్గరగా ఉందని ఉదహరించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వైకాపా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. బీసీ లు అంటే వెనుకబడిన కులాలు కాదని వెన్నుముక లాంటి వారని చాటి చెప్పిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్ తో బీసీలకు ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు. అంతకుముందు తెలుగుదేశం హయాంలో చంద్రబాబు ఆదరణ పథకంలో పనిముట్లు ఇచ్చి బీసీలను ఎదగకుండా చేశారని విమర్శించారు.
సర్దార్ పాపన్న గౌడ్ తెలుగువాడు అయినందుకు మనందరం గర్వించాలన్నారు. ప్రజల కోసం జీవించి త్యాగాలు చేసిన చరిత్రకారుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తన చేతుల మీదుగానే పాపయ్య గౌడ్ విగ్రహాలు మూడింటిని ఆవిష్కరించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఆయన పోరాట పటిమను, వీరోచిత జీవిత గాధను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికూటి రామారావు మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల క్రితమే లండన్ విక్టోరియన్ ఆల్బర్ట్ మ్యూజియంలో పాపయ్య గౌడ్ విగ్రహాన్ని నెలకొల్పారు అన్నారు. కేం బ్రిడ్జి యూనివర్సిటీ పాపన్న గౌడ్ జీవిత చరిత్రను పుస్తకంగా విడుదల చేసింది అన్నారు. 21 కోటలు కట్టి, 30 సంవత్సరాలు పాలించిన ఘన చరిత్ర పాపన్న గౌడ్ కు ఉందన్నారు. తొలి తెలుగు బహుజన చక్రవర్తి అని పేర్కొన్నారు. సాధారణ కల్లుగీత కార్మికుడు రాజు అయ్యాడని అదే పాపన్న గౌడ్ జీవితం చరిత్ర అన్నారు.
మొగల్ చక్రవర్తులు మెడలు వంచి గోల్కొండకు మహారాజు అయ్యాడని పాపన్న గౌడ్ జీవిత చరిత్రను ఆయన సమగ్రంగా వివరించారు. ఇంకా ఈ సభలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జడ్పిటిసి ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ పి.శేషులత, గౌడ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తాతా శ్రీనివాసరావు, వ్యవస్థాపక అధ్యక్షుడు చలపాటి వెంకటేశ్వరరావు, బొర్ర కృష్ణ, నీలాద్రిపురం సర్పంచ్ రాజమహేంద్రవరపు లక్ష్మణరావు, ఎంపీటీసీ మట్టా సత్యనారాయణ, పెదతాడేపల్లి నాయకులు కారింకి వీర్రాజు, మండల పార్టీ ప్రెసిడెంట్ జడ్డు హరిబాబు, ఆరేపల్లి సుబ్బారావు, నీలాద్రిపురం ఉపసర్పంచ్ రామారావు, నీలాద్రిపురం గ్రామ గౌడ్ సంఘం అధ్యక్షులు దాసరి రాంబాబు, కార్యదర్శి కోమాల శ్రీను, కోశాధికారి చిటికబత్తుల అంజలి, సురకని రామారావు, మండల పార్టీ యూత్ ప్రెసిడెంట్ ములకాల రాంబాబు, మహిళా ప్రెసిడెంట్ నూనె రాధ, మాజీ కౌన్సిలర్ బడుగు పెద్ద, మట్టా రామశంకర గౌడ్, మట్టా రామకృష్ణ, వైస్ ఎంపీపీ సూర్పని రామకృష్ణ, గౌడ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మట్ట లక్ష్మి, తాతా కృష్ణారావు, తాతా జగదీష్, కోట రాంబాబు, సొసైటీ ప్రెసిడెంట్లు వెలిశెట్టి నరేంద్ర కుమార్, చిక్కాల సత్యనారాయణ, గుమ్మల్ల తాతారావు, చిట్టి బొమ్మల కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.



