3 నుంచి కమలం రధ యాత్రలు
హైదరాబాద్ , ఆగస్టు 14: రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం కార్యక్రమాలను సిద్ధం చేస్తోంది. జనాల్లోకి వెళ్లడానికి ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా కార్యక్రమాలు చేపట్టాలని నాయకత్వం నిర్ణయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును, హామీలు అమలు చేయని వైఖరిని ప్రశ్నించేలా పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెలలో మూడు కేంద్రాల నుంచి రథయాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. అలంపూర్ (ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా), భద్రాచలం (ఉమ్మడి ఖమ్మం జిల్లా), బాసర (ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా) ల నుంచి రథయాత్రలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్కో కేంద్రం నుంచి ప్రారంభం అయ్యే రథ యాత్ర ప్రతి రోజూ కనీం 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ఈ రథయాత్రలు ప్రారంభించాలా లేదా ఆ రోజు రథయాత్ర ముగిసేలా చేపట్టాలా అన్న విషయంలో కొన్ని రోజుల్లో స్పష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ రథయాత్రల్లో రాష్ట్ర నేతలతో పాటు జాతీయ నేతలు పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ ఆందోళనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు ఎలా ఉండాలి, ఎలాంటి అంశాలను తీసుకోవాలి, ఎలా చేయాలి అనేది రూపకల్పన చేసేందుకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ నేతృత్వంలో సీనియర్ నేతలతో కమిటీని నిర్ణయించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశం సోమవారం కూడా జరగనుంది. తొలి దశలో 30 రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణను సోమవారం ఖరారు చేయనున్నారు. ఇందులో భాగంగా దళిత బంధు, బీసీ బంధు, నిరుద్యోగ సమస్య, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, వంటి ప్రధాన అంశాలపై కేసీఆర్ సర్కారు వైఫల్యాలను గ్రామ స్థాయిలో ఎండగట్టేలా ఆందోళన కార్యక్రమాలను రూపొందించనున్నారు. పోరాట కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ కె. లక్ష్మణ్ ఉంటారు. సభ్యులుగా విజయ శాంతి, చాడ సురేష్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, కరీంనగర్ జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ సహా ఇతర నేతలు కలిపి మొత్తం 14 మంది ఉంటారు. ఈ కమిటీ పకడ్బందీ ప్రణాళిక రూపొందించి, బీఆర్ఎస్ పార్టీ పై పోరాటాన్ని ఉద్ధృతం చేయనున్నారు. ఇలా చేస్తే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మొత్తంలో సీట్లు సాధించవచ్చని, తెలంగాణలోనూ అధికారంలోకి రాగలమని బీజేపీ భావిస్తోంది.