సంస్కారం లేని జీవితం వ్యర్థం
Life without culture is futile
రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సంస్కృతిక శాఖల మంత్రి “జూపల్లి కృష్ణారావు”
షాద్ నగర్ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభ
సమాజంలో సంస్కృతి సంప్రదాయాలు గాలికి పోయాయి
సామాజిక మాధ్యమాలతో కుసంస్కారం
కోట్లు వెచ్చించి విగ్రహాలు పెడుతున్నాం.. వారి ఆశయాలను వదిలేస్తున్నాం..
విద్య, వైద్యానికి 80% నిధులు కేటాయించాలి
గొప్ప చరిత్రకారుల విషయాలను సూచించే పుస్తకాలు అందుబాటులో ఉండాలి
ప్రతి ఇంట్లో లైబ్రరీ ఉండాలి..
షాద్ నగర్ గ్రంథాలయానికి రూ 5లక్షలు కేటాయించిన మంత్రి
షాద్ నగర్ సభలో మంత్రి “జూపల్లి కృష్ణారావు” కీలక వ్యాఖ్యలు
షాద్ నగర్ ఎమ్మెల్యే విలపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా గ్రంధాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
సంస్కారం లేని జీవితం వ్యర్థమని, సమాజంలో చదువుకోకపోతే వినాశనం తప్పదని, గ్రంథాలయాలతో సమాజంలో నూతన మార్పు తీసుకురావచ్చని దానికి విద్య ఎంతో అవసరమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సంస్కృతిక శాఖల మంత్రి “జూపల్లి కృష్ణారావు” స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆహ్వానం మేరకు గ్రేడ్ వన్ శాఖ గ్రంథాలయ అభివృద్ధి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభకు మంత్రి జూపల్లి, ఎమ్మెల్సీ కోదండరామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి స్థానిక మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ కే మదన్మోహన్ రెడ్డి తదితర పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభను ఉద్దేశించి మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో గ్రంధాలయాల పాత్ర ఎంతో ముఖ్యమని మంత్రి అన్నారు. సమాజంలో ఎన్నో అవలక్షణాలు దుర్మార్గాలు నిత్యం చోటుచేసుకుంటున్న సమాచారాన్ని మీడియా ద్వారా తెలుసుకుంటున్నామని ఇది అత్యంత బాధాకరమని అన్నారు. దీనికి అన్నింటికీ కారణం చదువు లేకపోవడమే అని అన్నారు. విద్య వ్యాప్తి చెందితే సమాజం సుభిక్షంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అందుకే తాను తన నియోజకవర్గంలో విద్యా వైద్యానికి 80% నిధులను కేటాయిస్తానని ఆ తర్వాతే మిగతా పనులను చూస్తానని స్పష్టం చేశారు. సంస్కారం లేని జీవితం విద్య రెండు వ్యర్ధమని అన్నారు. చదువుతోపాటు సంస్కారం కూడా నేర్పించాలని సమాజానికి సూచించారు. సంస్కారం లేకుండా సమాజంలో సంస్కృతి సంప్రదాయాలు నిర్వీర్యం అయిపోయాయని అన్నారు. దీనికి ఫలితమే మనం రోజు మీడియాలో జరిగే దుర్మార్గాలు చదువుతున్నామని అన్నారు. వాట్సప్ ఫేస్బుక్ పలు సామాజిక మాధ్యమాలలో నిత్యం మంచి కన్నా చెడే ఎక్కువ ప్రభావితం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో వేగవంతంగా మార్పు రావాలంటే విద్యను ప్రోత్సహించి గ్రామీణ ప్రాంతాలలో కూడా గ్రంధాలయాలు వెలిసేలా చూడాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటలైజేషన్ చేయడం గొప్ప పరిణామం దానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. షాద్ నగర్ గ్రంథాలయానికి తన శాఖ తరపున 5 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ధైర్యవంతులు, సాహసశీలులు, పోరాటయోధులు, స్వతంత్ర సమరయోధులు, ఉద్యమకారుల చరిత్ర గురించి తెలిసే పుస్తకాలు సమాజంలో ఎక్కువగా రావాలని వాటిని చదవాలని సూచించారు. సమాజంలో చిన్న చిన్న విషయాలకు యువత అభైత్యాలకు పాల్పడుతుందని గుర్తు చేశారు. దీనివల్ల చదువుల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకోవడం ప్రేమ వికటిస్తే చౌకు పాల్పడడం, లేదా చంపడం లాంటి అవ లక్షణాలు సమాజంలో కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లు ఖర్చుపెట్టి మహాను భావుల విగ్రహాలు పెడుతున్నామని కానీ వారి ఆశయాలను మాత్రం పాటించడం లేదని విచారం వ్యక్తం చేశారు. సమాజంలో జీవన విధానం ప్రస్తుతం ధ్వంసం అవుతుందని దీని నుండి బయటపడాల్సిన అవసరం ఉందన్నారు. జీవితాన్ని మంచి ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. 90 శాతం మంది అప్పుల కొలిమిలో కూలిపోతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమాజంలో పౌరుల అలవాట్లు మారాల్సిన అవసరం ఉందన్నారు. ఆడంబరాలకు ఆర్భాటాలకు వెళ్లి ఆర్థిక విధ్వంసానికి గురికావుకూడదని అన్నారు. ప్రతి ఇంట్లో ఒక లైబ్రరీ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. విద్య వైద్యానికి పెద్దపీట వేయాలని ఆ తర్వాతే మిగతావి చూడాలని మంత్రి సూచించారు.



