కరీంనగర్, ఆగస్టు 18: : మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సాయన్న (70) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న రాజిరెడ్డి తుదిశ్వాస విడిచారు. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అయిన రాజిరెడ్డి మావోయిస్టుల్లో కలిసిన తర్వాత ఆయనపై ప్రభుత్వం కోటి రివార్డు ప్రకటించింది కూడా. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో రాజిరెడ్డి కీలకంగా వ్యవహరించాడు. ఆయన దండకారణ్యంలో అనారోగ్యంతో మృతి చెందినట్లు మావోయిస్టులు సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. సామాజిక మాద్యమాల్లో మల్లా రాజారెడ్డి మరణ వార్త వైరల్ కావడంతో కేంద్ర నిఘా వర్గాలు దీనిపై దృష్టిసారించాయి. మరోవైపు రాజారెడ్డి మృతిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు సైతం అధికారికంగా ధృవీకరించారు. కాగా మల్లా రాజిరెడ్డి స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి గ్రామం. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా తొలితరం మావోయిస్టు నేతల్లో మల్లా రాజిరెడ్డి ఒకరు. మావోయిస్టు పార్టీలో చిన్నస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన కేంద్ర కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మావోల కార్యకలాపాలలో మల్లా రాజరెడ్డి కీలక పాత్ర పోషించారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లతో కూడిన మావోయిస్టుల నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక ఉద్యమానికి ఇన్‌ఛార్జిగా కూడా పనిచేశారు. సంగ్రామ్, సాయన్న, మీసాల సాయన్న, అలోక్, దేశ్‌పాండే, సత్తెన్న వంటి పేర్లతో పలు పేర్లతో మావో కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మల్లా రాజిరెడ్డిపై దేశ వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఆయనపై పలు రాష్ట్రాల్లో కోటి రూపాయల నజరానా కూడా ఉంది. పీపుల్స్ వార్ అగ్రనేతలతో రాజిరెడ్డి కలిసి పనిచేశారు. కొండపల్లి సీతారామయ్య, గణపతి, సత్యమూర్తిలకు రాజిరెడ్డి సహచరుడు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ అయిన శ్రీపాదరావు హత్య కేసులో రాజిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. 2008 జనవరిలో కేరళలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు రాజిరెడ్డిని అరెస్ట్ చేసి మెట్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆయన పలు కేసుల్లో నిందితుడిగా తేలడంతో కరీంనగర్ జైలులో రెండున్నరేళ్లు శిక్ష అనుభవించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తపాల్‌పూర్‌లో నలుగురి హత్య కేసులో, ఉమ్మడి ఏపీలో పీపుల్స్ వార్ తపాల్‌పూర్ ఘటన ఆయన నిందితుడిగా ఉన్నాడు.