- Advertisement -
నాగబాబు ఎమ్మెల్సీ… తర్వాత మంత్రి పదవి…
Nagababu MLC... then minister post...
విజయవాడ, డిసెంబర్ 30
: జనసేన నేత, సోదరుడు నాగబాబుకు మంత్రి పదవిపై ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. రాజకీయాల్లో పని తీరే ప్రామాణికమని, కలిసి పనిచేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత తనకు ఉందని అన్నారు. సోమవారం మంగళగిరిలో ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘మాకు బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా అన్నయ్య సొంతంగా ఎదిగారు. ఇప్పుడు మా తర్వాత తరం పిల్లలకు ఓ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. మనతో ప్రయాణం చేసి, పనిచేసిన వారిని నేను గుర్తించాలి. నాగబాబు నాతో పాటు సమానంగా పనిచేశారు. వైసీపీ నేతలతో తిట్లు తిన్నారు. ఆయన పార్టీ కోసం నిలబడ్డారు. ఇక్కడ కులం, బంధుప్రీతి కాదు.. పనిమంతుడా కాదా? అన్నది చూడాలి. ఎంపీగా ప్రకటించి, మళ్లీ నాగబాబును తప్పించాం.పార్టీ కోసం మొదటి నుంచి మనోహర్, హరిప్రసాద్ పనిచేశారు. ఎవరికి ప్రతిభ ఉందో వారికి పదవులు ఇస్తాం. ఈ విషయంలో మీరెందుకు జగన్‌ను అడగలేదు?. కేవలం నన్ను మాత్రమే ఎందుకు అడుగుతున్నారు.?. నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికవుతారు. మంత్రి పదవి విషయంలో తర్వాత చర్చిస్తాం. నాగబాబు త్యాగం గుర్తించి రాజ్యసభకు అనుకున్నాం. కుదరలేదు కనుకే ఎమ్మెల్సీ అనుకున్నాం. మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు. ఎమ్మెల్సీ అయ్యాకే కేబినెట్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలీదు. ఆయన పని తీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చాను. రాజకీయాల్లో కులం కన్నా పని తీరే ప్రామాణికం’ అని పవన్ పేర్కొన్నారు.అటు, ‘రేషన్ బియ్యం మాయమైందని నిజమని.. డబ్బులు కట్టింది వాస్తవమని.. ఇంట్లో ఆడవాళ్ల పేరిట గిడ్డంగి పెట్టిందెవరు.?’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైసీపీ నేత పేర్ని నాని చేసిన తప్పులే ఆయన ఇంట్లో వాళ్లను వీధిలోకి తెచ్చాయని అన్నారు. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన వారిని మీరు తిట్టలేదా.? అని నిలదీశారు. ‘అప్పుడు బూతులు తిట్టి ఇప్పుడు నీతులు వల్లిస్తే ఎలా.?. గత ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తోంది. అడ్డగోలు నిర్ణయాలపై అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. పని చేసే సంస్కృతిని చంపేశారు. గత ప్రభుత్వం తొలి 6 నెలలు, ఈ ప్రభుత్వం 6 నెలల బేరీజు వేసుకోండి. ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసం పని చేయాలని చెబుతున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం, పాలన తీరుపైనే ఇప్పటివరకూ దృష్టి సారించాం. ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. పదవులను బాధ్యతతో నిర్వర్తిస్తాం. ప్రతి గ్రామానికి తాగునీరు ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల. తాగునీరు, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాం.’ అని పవన్ పేర్కొన్నారు.
- Advertisement -