ఆపరేషన్ పిఠాపురం…
కాకినాడ, మార్చి 16
ఏపీలో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి ఆకర్షిస్తోంది. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ పవన్ కీలక ప్రకటన చేశారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఎలాగైనా పవన్ ను ఓడించాలన్న వైసీపీ పావులు కదపడం ప్రారంభించింది. పవన్ ప్రకటనతో టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు ఆందోళనకు దిగారు. భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. తనను కలవాలని వర్మకు సూచించారు.ఇప్పటికే ఇక్కడ వైసిపి అభ్యర్థిగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పేరును ఖరారు చేశారు. పవన్ పోటీ చేయబోతున్నారన్న సమాచారం మేరకు ముద్రగడ పద్మనాభం పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన ద్వారా కొంతవరకు పవన్ కు చెక్ చెప్పాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే రీజనల్ ఇన్చార్జ్ మిధున్ రెడ్డి రంగంలోకి దిగారు. నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీ పై దృష్టి పెట్టారు. అక్కడ తమతో కలిసి వచ్చే వారిపై ఫోకస్ పెట్టారు. పోల్ మేనేజ్మెంట్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. టిడిపి జనసేన ల నుంచి వచ్చే నాయకులను ఆకర్షించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు. అటు సామాజికపరంగా ముద్రగడ సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారు.పిఠాపురంలో కాపు సామాజిక వర్గం అధికం. దాదాపు 91 వేల పైగా ఆ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. కాపుల్లో మెజారిటీ వర్గం పవన్ వెంట నడుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ముద్రగడ ద్వారా కొంత అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. మాలలతోపాటు శెట్టిబలిజలు, చేనేత కార్మికులు, బెస్తలను వైసీపీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. రెడ్డి, యాదవ,తూర్పు కాపు, మాదిగ సామాజిక వర్గాన్ని ఆకర్షించాలని భావిస్తున్నారు. మొత్తం ఆ సామాజిక వర్గ నేతలను పిఠాపురంలో ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అసంతృప్తితో ఉన్న టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మకు సైతం వైసీపీ కీలక నేతలు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.అయితే ఇప్పుడు పిఠాపురంలో వర్మ కీలకం కానున్నారు. 2014 ఎన్నికల్లో టికెట్ దక్కకపోయేసరికి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వర్మ విజయం సాధించారు. ఇప్పుడు కూడా అదే తరహా ప్రయత్నం చేయాలని మద్దతుదారులు కోరుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలోనే వర్మకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. తనను కలవాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. పవన్ పోటీలో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు వర్మను సముదాయిస్తారని.. ఆయన భవిష్యత్తుకు భరోసా ఇస్తారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం తన ఆపరేషన్ మొదలుపెట్టింది. పవన్ ను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అందులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
స్వతంత్ర అభ్యర్ధిగా వర్మ
కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయ సమీరణాలు వేగంగా మారుతున్నాయి. టికెట్ రాలేదని అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్ వీఎస్ ఎన్ వర్మ.. కార్యకర్తలు, అనుచరులతో సమావేశం కానున్నారు. పిఠాపురం నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కార్యకర్తల నిర్ణయంతో బరిలోకి దిగే అవకాశం ఉందని వర్మ వర్గీయులు అంటున్నారు. ఒకవేళ పిఠాపురం నుంచి వర్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే.. త్రిముఖ పోటీ ఉండే ఛాన్స్ ఉంది. టీడీపీ విడుదల చేసిన రెండో జాబితా పిఠాపురంలో అసమ్మతిని రాజేసింది. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలకు నిప్పుపెట్టి రచ్చ రచ్చ చేశారు. వర్మకు సీటు ఇవ్వకపోవడంతో తమ అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేశారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు.పిఠాపురంలో కాపు సామాజిక ఓట్లు అత్యధికంగా ఉంటాయి. 2014లో వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. ఈసారి కచ్చితంగా పిఠాపురం టీడీపీ టికెట్ వర్మకే వస్తుందని అంతా భావించారు. కానీ, పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్లుగా స్వయంగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలో వర్మ నిర్ణయం ఏంటి? పవన్ కు వర్మ సపోర్ట్ చేస్తారా? లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? వర్మ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండనుంది? అనేది హాట్ టాపిక్ గా మారింది.పిఠాపురం టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే వర్మ.. కార్యకర్తలు, అనుచరులతో సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ భేటీ తర్వాత వర్మ తన కార్యచరణ ప్రకటించే అవకాశం ఉంది. వర్మ గత కొన్నేళ్లుగా పిఠాపురంలో సేవలు అందిస్తున్నారు. 6 నెలల నుంచి చూస్తే.. వర్మ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. వర్మ కచ్చితంగా బరిలో ఉంటారని కార్యకర్తలు బలంగా నమ్మారు. అందుకు అనుగుణంగా ప్రచారం చేసుకుంటూ వర్మ ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు వేడెక్కాయి.వర్మ కచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆయన వర్గీయులు సూచిస్తున్నారు. గత 18ఏళ్లుగా పిఠాపురం నియోజకవర్గంలో స్థానికుడిగా ఉన్నాను, సేవలు అందిస్తున్నాను, పిఠాపురం నుంచి బరిలో ఉంటాను అని వర్మ చెబుతూ వస్తున్నారు. ఒకవేళ వర్మ పోటీలోకి దిగితే.. పిఠాపురంలో త్రిముఖ పోరు ఉండనుంది. మరి అధిష్టానం పిలిచి వర్మను సముదాయిస్తుందా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. పిఠాపురం నియోజకవర్గంలో ఇటు టీడీపీ, అటు జనసేన శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఆపరేషన్ పిఠాపురం…
- Advertisement -
- Advertisement -