- Advertisement -
వాయిదాలతో ప్రారంభమైన పార్లమెంట్
Parliament started with adjournments
న్యూఢిల్లీ, నవంబర్ 25, (వాయిస్ టుడే)
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే విపక్ష సభ్యుల నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. అదానీ వ్యవహారంపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబడటంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ సభను ఎల్లుండికి వాయిదా వేశారు. అటు లోక్ సభను కూడా అదానీ వ్యవహారం కుదిపేసింది. విపక్ష సభ్యుల నినాదాలతో హోరెత్తడంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశాల్ని నవంబర్ 27కు వాయిదా వేశారు.అదానీ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేసింది. శీతాకాల సమావేశాల తొలిరోజే ఉభయ సభల్లో అదానీ అంశంపై చర్చ జరపాలని విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పట్టుబట్టారు. సమావేశాలను ప్రారంభించిన గంటలోనే ఎంపీల నినాదాలతో ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. ఏఐసీసీ ప్రెసిడెంట్, సీనియర్ రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో అదానీ ఇష్యూపై చర్చ మొదలుపెట్టాలని కోరారు. అందుకు రాజ్యసభ చైర్మన్ అంగీకరించకపోవడంతో సభలో సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభను ఎల్లుండి(నవంబర్ 27)కు వాయిదా వేశారు.అటు లోక్ సభలోనూ ఇదే అంశంపై రచ్చ రచ్చైంది. వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన అదానీ అంశంపై చర్చించాల్సిందేనంటూ లోక్ సభలో ప్రతిపక్ష పార్టీల సభ్యులు పట్టుబట్టారు. పదే పదే స్పీకర్ ముందు నినాదాలు చేయడంతో స్పీకర్ ఓం బిర్లా లోక్ సభ సమావేశాల్ని ఎల్లుండికి వాయిదా వేశారు.పార్లమెంట్ సమావేశాల్ని సజావుగా సాగేందుకు సహాకరించాలని ప్రధాని మోదీ ముందుగా చెప్పినప్పటికి విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడానికే పట్టుబట్టాయి. దీంతో ఉభయసభలు ప్రారంభమైన గంటలోపే వాయిదా పడ్డాయి.
ప్రతిపక్షాలు మారాలి
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్ష పార్టీలు, ఉభయ సభల సభ్యులు సరైన చర్చ జరిగే విధంగా సహాకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. భారత రాజ్యంగం అమల్లోకి వచ్చి రేపటితో 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన పార్లమెంట్ భవన్ ముందు సభలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపై మాట్లాడారు. విపక్ష పార్టీలు ప్రజల ఆకాంక్షకు అనుగూణంగా నడుచుకోవడం లేదని అందుకే పదే పదే తిరస్కరించబడుతున్నారని విమర్శించారు. పిరికెడు మంది సభ్యులు చర్చ జరగకుండా సభలో అడ్డుకుంటున్నారని..అలాంటి సంస్కృతి మారాలన్నారు. సభలో సరైన చర్చ జరగాలని సభ్యులను ప్రధాని వేడుకున్నారు.మన పార్లమెంట్ నుంచి ప్రజలకు సరైన సందేశం వెళ్లాలని కోరారు.అన్నీ పార్టీల్లోనూ కొత్త సభ్యులు ఉన్నారని..వారికి సభలో మాట్లాడే అవకాశం రావాలని మోదీ కోరారుపార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే మోదీ ఈవిధంగా విపక్ష సభ్యులపై మాట్లాడటం చూస్తుంటే సభను సజావుగా సాగేలా చూడాలన్నదే ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. అయితే విపక్షాలు మాత్రం ఢిల్లీ వాయుకాలుష్యం దగ్గర నుంచి అదానీ స్కాం, మణిపూర్ అల్లర్లు, మహరాష్ట్ర ఎన్నికల ఫలితాలు వంటి అనేక అంశాలను చర్చలో లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీయాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగానే సభలో ఢిల్లీ వాయు కాలుష్యంపై చర్చకు అనుమతివ్వాలని కాంగ్రెస్ సభ్యులు నోటీసులు కూడా ఇచ్చారు. ఈనేపథ్యంలోనే మోదీ సమావేశాల్లో గందరగోళం చేయవద్దని సున్నితంగా చెప్పినట్లు కనిపిస్తోంది.మరోవైపు ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ హాలులో సమావేశమయ్యారు. సభలో వ్యవహరించాల్సిన తీరు..చర్చించాల్సిన అంశాలపై మాట్లాడుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
- Advertisement -